Tazmin Brits century celebration: క్రికెట్ ఒక జంటిల్ మెన్ గేమ్.. క్రికెటర్లు అంతా హుందాగా వ్యవహరిస్తారు. ఎంపైర్ల నిర్ణయానికి కట్టుబడి ఆడతారు. గొడవలు ఉండవు. అయితే ఈ తరం క్రికెటర్లు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇది ఎక్కువగా చేస్తారు. కానీ, ఇటీవలి కాలంలో సైగలతో, సెలబ్రేషన్స్ సమయంలో ప్రత్యర్థులకు సైగలు చేస్తూ ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. అభిమానుల మధ్య సోషల్ వార్‌కు తెర తీస్తున్నారు. క్రికెట్ ఆటలో ఆటగాళ్లు తమ విజయాలను వ్యక్తపరచడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఈ వేడుకలు సాంస్కృతిక, మతపరమైన ఛాయలు సంతరించుకుంటున్నాయి. ఇది కేవలం ఆటలో భాగమే కాకుండా, సమాజపరమైన చర్చలను రేకెత్తిస్తోంది.
మారుతున్న సెలబ్రేషన్స్ తీరు..
ఆసియా కప్ నుంచి క్రికెటర్ల సెలబ్రేషన్స్ తీరు మారుతోంది. భారత్–పాక్ క్రికెట్ మ్యాచ్ అంటేనే హై ఓల్టేజీ మ్యాచ్. ఇందులో ఆటగాళ్ల ప్రవర్తన కూడా అభిమానులపై ప్రభావం చూపుతుంది. తాజాగా ఆసియా కప్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన సైగలు చేయడం వాటిని తిప్పి కొట్టేలా భారత క్రికెటర్లు మ్యాచ్‌లో చిత్తుగా ఓడించడంతోపాటు, సైగలు చేశారు. తాజాగా మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ టాజ్మిన్ బ్రిట్స్ సెంచరి చేసిన తర్వాత మైదానంలో శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాంప్రదాయిక వేడుకలు..
వ్యక్తిగత భావోద్వేగాలు గతంలో క్రికెట్ ఆటగాళ్ల విజయ వేడుకలు సరళంగా, వ్యక్తిగత స్థాయిలో ఉండేవి. బ్యాటర్లు అర్ధ శతకం లేదా శతకం సాధించినపుడు బ్యాట్‌ను ఆకాశంవైపు చూపి సంతోషం వ్యక్తం చేసేవారు లేదా మైదానాన్ని ముద్దు పెట్టుకునేవారు. బౌలర్లు వికెట్ సాధించిన సమయంలో బంతిని ముద్దాడటం లేదా ఎగిరి ఆనందం పంచుకోవడం సర్వసాధారణం. ఈ రకమైన వ్యక్తీకరణలు ఆటగాళ్ల భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ, ఆటను మరింత ఆకర్షణీయంగా చేసేవి. అయితే, ఇవి ఎలాంటి వివాదాలకు దారితీయకుండా, కేవలం ఆటలో భాగంగా మిగిలేవి. ఆసియా కప్ టోర్నమెంట్ తర్వాత క్రికెట్ వేడుకలలో గణనీయమైన మార్పు కనిపించింది. ముఖ్యంగా భారత, పాకిస్తాన్ ఆటగాళ్లు తమ విజయాలను సాంస్కృతిక సంకేతాలతో వ్యక్తపరుస్తున్నారు. కొందరు ఆటగాళ్లు ’ఆపరేషన్ సిందూర్’ లాంటి సంకేతాలను ఉపయోగించారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి మార్పులు ఆటను మరింత రాజకీయీకరణ చేస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు, మరికొందరు ఇది స్వేచ్ఛాయుత వ్యక్తీకరణగా చూస్తున్నారు. ఫలితంగా, ఈ వేడుకలు వివాదాలకు దారితీసి, ఆటగాళ్లు, అభిమానుల మధ్య చర్చలను రేకెత్తిస్తున్నాయి.
బ్రిట్స్ శ్రీరాముడి ప్రేరణ..
ఉమెన్స్ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ టాజ్మిన్ బ్రిట్స్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించిన తర్వాత విల్లు ఎక్కుపెట్టినట్లు సంకేతం చేసింది. ఈ వేడుక సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించి, భారతీయ అభిమానులు దీన్ని శ్రీరాముడి విల్లు బాణం గా అన్వయించుకున్నారు. అయితే, బ్రిట్స్ స్వయంగా దీన్ని తన ప్రియమైన వ్యక్తి డబ్ల్యూఎస్–ఎల్ కోసం చేసినట్లు వివరించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారతీయులు దీన్ని సనాతన ధర్మం యొక్క ప్రచారంగా చూస్తూ సానుకూలంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని రాముడి విజయ సందేశంగా పేర్కొంటున్నారు, మరికొందరు సాంస్కృతిక గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది క్రికెట్ వేడుకలు ఎలా సమాజపరమైన భావాలను ప్రతిబింబిస్తాయో చూపుతోంది. అయితే, ఇలాంటి సంకేతాలు అంతర్జాతీయంగా అర్థవ్యాఖ్యానాలు మారిపోతాయి, ఇది ఆటగాళ్లు మరియు అభిమానుల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది లేదా విభేదాలను సృష్టిస్తుంది. మొత్తంగా, క్రికెట్ వేడుకలు సాంస్కృతిక మిశ్రణాలతో మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కానీ ఇవి సమాజపరమైన సమతుల్యతను కాపాడాలి.