T20 World Cup Women: న్యూజిలాండ్ పై పాకిస్తాన్ ఓటమి.. ఇక మనవాళ్లు బ్యాగులు సర్దుకొని ఇంటికి రావడమే..

ఆశలు అడుగంటిపోయాయి.. పాకిస్తాన్ గెలుస్తుందని.. మనం సెమీస్ వెళ్తామని.. వేసుకున్న అంచనాలు మొత్తం గాలికి కొట్టుకుపోయాయి.. మనం ఎలాగైతే 58 పరుగుల తేడాతో తొలి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయామో.. మనకంటే మూడు పరుగుల తక్కువతో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 111 పరుగుల టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన పాకిస్తాన్ 56 పరుగులకు ఆలౌట్ అయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 15, 2024 10:14 am

T20 World Cup Women

Follow us on

T20 World Cup Women: పాకిస్తాన్ ఓడిపోవడంతో భారత్ సెమిస్ ఆశలు అడుగంటిపోయాయి. దీంతో టి20 వరల్డ్ కప్ నుంచి గ్రూప్ దశలోనే భారత మహిళల జట్టు నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్ – ఏ లో ఆఖరి లీగ్ మ్యాచ్ సోమవారం రాత్రి న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. న్యూజిలాండ్ పై పాకిస్తాన్ దారుణంగా ఓడిపోవడంతో భారత జట్టు సెమీఫైనల్ ఆశలు పూర్తిగా అడుగంటి పోయాయి. న్యూజిలాండ్ జట్టు స్వల్ప స్కోర్ చేసినప్పటికీ.. దానిని కాపాడుకోవడంలో సఫలీకృతమైంది. 54 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచి గ్రూప్ – ఏ లో రెండవ స్థానంలో నిలిచి.. దర్జాగా సెమీ ఫైనల్ వెళ్ళింది. ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్ లు గెలిచి.. గ్రూప్ – ఏ లో టాపర్ గా నిలిచింది. సెమీఫైనల్ లోకి ప్రవేశించింది.. పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో ముందుగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసింది. సుజి బేట్స్ (28) టాప్ స్కోరర్ గా నిలిచింది. హాలిడే (22), సోపీ డివైన్ (19) పర్వాలేదనిపించారు. నష్రా (3) క్రికెట్లు పడగొట్టింది..

కుప్ప కూలింది

111 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా (21) టాప్ స్కోరర్ గా నిలిచింది. మోనీబా అలీ (15) పరుగులతో పర్వాలేదనిపించింది. అమీలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టింది. కార్సన్ రెండు వికెట్లు తీసింది..

దూకుడుగా ఆడబోయి..

10.4 ఓవర్లలో టార్గెట్ చేజ్ చేస్తే సెమీస్ బెర్త్ లభిస్తుందనే అంచనాతో పాక్.. దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే వికెట్లను వెంటవెంటనే పడగొట్టుకుంది. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 28 పరుగులు మాత్రమే చేసి, ఐదు వికెట్లను నష్టపోయింది. ఈ క్రమంలో ఫాతిమా, నిదా ధర్(9) ఆరో వికెట్ కు 24 పరుగులు జోడించారు. దీంతో పాక్ గెలుస్తుందని అంచనాలు పెరిగిపోయాయి. ఇదే క్రమంలో నిదా స్టంట్ అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత ఓమైమా(2), అరూబ్(0) పెట్టమంటేని అవుట్ కావడం.. ఫాతిమా కూడా పెవిలియన్ చేరుకోవడంతో పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. దీనికి తోడు భారత్ సెమీస్ అవకాశాలు పూర్తిగా అడుగంటి పోయాయి.

బౌలర్లు రెచ్చిపోయినప్పటికీ

పాకిస్తాన్ బౌలర్లు ముందుగా రెచ్చిపోయారు. న్యూజిలాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు.. నష్రా సంధు న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. వాస్తవానికి పాకిస్తాన్ ఫీల్డర్లు సరిగ్గా క్యాచ్ లు పట్టి ఉంటే న్యూజిలాండ్ మరింత తక్కువ స్కోర్ కు ఆల్ అవుట్ అయ్యేది. నిదా బౌలింగ్లో నాలుగు క్యాచ్ లను పాకిస్తాన్ ఫీల్డర్లు వదిలేశారు. అయితే పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ ను న్యూజిలాండ్ పెద్దగా వినియోగించుకోలేకపోయింది. పవర్ ప్లే లో న్యూజిలాండ్ ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ప్రమాదకరమైన ప్లిమ్మర్ (17) త్వరగానే అవుట్ అయింది. ఈ దశలో కెప్టెన్ సోఫీ, హాలిడే నాలుగో వికెట్ కు 38 రన్స్ జోడించారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.