Nominated posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి మరోసారి ప్రారంభమైంది. ఒకటి రెండు రోజుల్లో రెండో విడత నామినేటెడ్ పోస్టుల జాబితా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే 20 కార్పొరేషన్లను ప్రకటించారు. రెండో విడతలో మరికొన్ని ప్రకటించేందుకు సిద్ధపడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మూడు పార్టీల నేతలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. అయితే తొలిసారిగా ప్రకటించిన 20 కార్పొరేషన్లకు సంబంధించి.. రెండు జనసేనకు కేటాయించారు. ఒకటి బిజెపికి ఇచ్చారు. దీంతో పదవులు దక్కని టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం పై జనసేన తో పాటు బిజెపి నేతలు ఆవేదన చెందారు. అయితే విడతల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని.. ఎవరు అసంతృప్తి చెందవద్దని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అసంతృప్త నేతలు బయట మాట్లాడవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు రెండో విడత నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని తెలియడంతో మూడు పార్టీల నేతల్లో ఒక రకమైన ఆసక్తి కనిపిస్తోంది.అయితే ఈసారైనా తమకు ప్రాధాన్యత దక్కుతుందా లేదా అని జనసేన నేతలు ఆత్రుతతో కనిపిస్తున్నారు. బిజెపి సీనియర్లు సైతం పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు.
* చాలామంది త్యాగధనులు
తెలుగుదేశం పార్టీలో చాలామంది త్యాగం చేసిన నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 31 అసెంబ్లీ స్థానాలను మిత్రులకు కేటాయించారు. అయితే గత ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇలా టికెట్ త్యాగం చేసిన వారికి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కానీ తొలి విడత నామినేటెడ్ పోస్టుల ప్రకటన సమయంలో వీరిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో వీరిలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అయింది.
* ఆశగా నేతల ఎదురుచూపు
తెలుగుదేశం పార్టీలో పదవులకు దూరంగా ఉన్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పట్టాభి, ఆలపాటి రాజా, పిఠాపురం వర్మ, గండి బాబ్జి వంటి వారు ఉన్నారు.టిడిపి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటి వారు సైతం పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. తమ పెద్దరికానికి తగ్గ పదవులు కావాలని భావిస్తున్నారు. అందుకే రెండోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో హై కమాండ్ పదవుల పంపకానికి దిగుతుండడంతో వీరంతా ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.