T20 World Cup 2021: టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ పై రాజకీయ మేఘాలు కమ్ముకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా క్వాలిఫైడ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. భారత్ సహా 8 దేశాలు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వామప్ మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లండ్ ను ఓడించింది. రెండో మ్యాచ్ లో ఆస్రేలియాతో ఆడనుంది. కానీ ఈనెల 24న జరిగే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై రాజకీయ వివాదాలు మొదలయ్యాయి. దాయాది దేశం ఉగ్రదాడులకు తెగబడుతున్న వేళ దానితో ఆట అవసరమా అని అందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో మ్యాచ్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

ఈనెల 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ రాజకీయ నేతల వ్యాఖ్యలతో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జమ్ముకశ్మీర్ లో పాకిస్తాన్ చేస్తున్న మారణహోమానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని పలువురు చెబుతున్నారు.
భద్రతా సిబ్బంది కాకుండా సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదాలు ఉగ్రదాడులకు పాల్పడటం క్షమించరాని నేరంగా భావిస్తున్నారు. కశ్మీర్ కు వలస వచ్చిన వారిని టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశంతో ఆట ఆడాల్సిన అవసరం ఏర్పడిందా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ములో స్థానికేతరుల సంఖ్య భారీగా పెరగడంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
భారత పాకిస్తాన్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేరేపిత ఉగ్రవాదంతో చెలరేగిపోతున్న దేశానికి సరైన సమాధానం చెప్పాలన్నారు. దీంతో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అవసరం లేదని చెప్పారు. దీనిపై ఆప్ నాయకులు కూడా గళం కలిపారు. భారత పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణ చేపట్టరాదని పేర్కొన్నారు. గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిచ్ ను ధ్వంసం చేసిన పార్టీ ఇప్పుడు ఆట నిర్వహణపై ఎందుకు మొగ్గు చూపుతుందని ప్రశ్నించారు. దీంతో భారత పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు కమ్ముకున్నాయి.