T20 World Cup 2024: మిగతా ఫార్మాట్లతో పోలిస్తే.. టి20 లో వెస్టిండీస్ జట్టుకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. హార్డ్ హిట్టర్లు ఉండడంతో.. టి20 లలో ఆ జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది.. ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్లలో వెస్టిండీస్ జట్టు కూడా ఉంది. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియాపై 250+ స్కోర్ నమోదు చేసి షాక్ ఇచ్చింది. అయితే అలాంటి జట్టు పసికూన చేతిలో వణికిపోయింది. టి20 వరల్డ్ కప్ లీగ్ పోరులో భాగంగా గయానా వేదికగా పపూవా న్యూ గినియా(Papua New Guinea) జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్(West Indies) ఐదు వికెట్ల తేడాతో విజయ సాధించింది. వాస్తవానికి న్యూగినియా చాలా చిన్న జట్టు. ఆయనప్పటికీ వెస్టిండీస్ ఎదుట ఓటమిని అంత సులభంగా ఒప్పుకోలేదు. చివరి వరకు పోరాడింది.. ఒకానొక దశలో వెస్టిండీస్ జట్టును ఓడించేలాగా కనిపించింది.. అయితే రోస్టన్ చేజ్(42*), రసెల్(15) ధాటిగా ఆడటంతో వెస్టిండీస్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో న్యూగినియా ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. బావూ(50), ప్లిన్(25*) ఆకట్టుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో ఆల్జారీ జోసెఫ్, రసెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. షెఫర్డ్, హోస్సేన్, మోయట్జీ తలా ఒక వికెట్ పడగొట్టారు. అయితే ఈ టార్గెట్ చేజ్ చేసేందుకు వెస్టిండీస్ 19 ఓవర్ల పాటు ఆడాల్సి వచ్చింది. పైగా 5 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేదించింది..
స్వల్ప లక్ష్యమైనప్పటికీ వెస్టిండీస్ కు ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. జాన్సన్ చార్లెస్ ను అలేయ్ గోల్డెన్ డక్ అవుట్ చేశాడు. నికోలస్ పూరన్(27), ఓపెనర్ (34) నిలకడగా ఆడారు.. ప్రమాదకరంగా మారుతున్న వీరిని న్యూగినియా బౌలర్లు వెంట వెంటనే అవుట్ చేశారు.. రూథర్ ఫోర్డ్(2), పావెల్(15) త్వరగానే పెవిలియన్ చేరుకున్నారు.. ఫలితంగా 97 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లను వెస్టిండీస్ కోల్పోయింది. అయితే ఇదే హవాను న్యూ గినియా బౌలర్లు కొనసాగించలేకపోయారు.. చివరి 3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుకు 31 పరుగులు కావలసి వచ్చినప్పుడు.. అసాద్ వలా బౌలింగ్లో వెస్టిండీస్ ఏకంగా 18 పరుగులు పిండుకుంది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా వెస్టిండీస్ వైపు మరలింది. రసెల్, చేజ్ స్థిరంగా నిలబడి లక్ష్యాన్ని చేదించారు.
టాస్ గెలిచిన వెస్టిండీస్ న్యూ గినియా ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే ఆ జట్టుకు ఆశించినత స్థాయిలో ఆరంభం లభించలేదు. ప్రారంభంలోనే టోని(2), లెగా(1), అసాద్ వలా(21) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సెసే బావూ క్రీజ్ లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతూ న్యూ గినియా స్కోర్ బోర్డ్ ను ముందుకు కదిలించాడు.. తోటి ఆటగాళ్ల నుంచి సహకారం లభించకపోయినప్పటికీ 42 బంతుల్లో అర్థ శతకం చేశాడు. ఆ తర్వాత అతను కూడా అవుట్ అయ్యాడు. చివర్లో వచ్చిన కిప్లిన్(25), చాద్ సోపెర్(10) దూకుడుగా ఆడటంతో న్యూగినియా 136 రన్స్ చేసింది.