ICC T20 World Cup 2024 : 23 ట్రిలియన్ డాలర్ల జిడిపితో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా అమెరికా ఉంది. 2.3 ట్రిలియన్ డాలర్ల జిడిపితో ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా కెనడా అలరారుతోంది. వస్తు సేవలు, ఫైనాన్స్, తయారీ రంగం, టెక్నాలజీ వంటి విభాగాలలో ఈ రెండు దేశాలు ప్రబల శక్తులుగా ఉన్నాయి. అయితే అలాంటి ఈ దేశాలకు భారత్, ఇతర ఆసియా దేశాలే దిక్కుగా మారాయి. ఇంతకీ ఏ రంగంలో అంటే..
అమెరికా పేరు చెప్తే బేస్ బాల్ గుర్తుకొస్తుంది. కెనడా గురించి ప్రస్తావనకు వస్తే ఐస్ హాకీ మదిలో మెదులుతుంది. అయితే ఈ రెండు దేశాలకు క్రికెట్లో ప్రావీణ్యం చాలా తక్కువ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది రెండు దేశాలలోనూ క్రికెట్ క్రీడను అభివృద్ధి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్, అమెరికా దేశాల వేదికలుగా నిర్వహిస్తోంది.. అయితే క్రికెట్లో ప్రావీణ్యం లేని సందర్భంగా.. అటు అమెరికా, ఇటు కెనడా దేశాలు తమ జాతీయ జట్లను భారత్, ఆసియా దేశాలకు చెందిన క్రీడాకారులతో భర్తీ చేశాయి. వాస్తవానికి అమెరికా, కెనడా దేశాలలో వలసవాదులు ఎక్కువగా ఉంటారు. ఆ వలస వాదులే ఈ రెండు దేశాల క్రికెట్ జట్లలో కీలక క్రీడాకారులుగా రూపాంతరం చెందారు.
టి20 వరల్డ్ కప్ లో అమెరికన్ క్రికెట్ జట్టుకు భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, వంటి క్రీడలకు అమెరికాలో విశేష ఆదరణ ఉంది. ఆ దేశంలో క్రికెట్ క్రీడను మాత్రం ఆసియా ఖండం నుంచి వలస వచ్చిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సంతతి క్రీడాకారులు ఆడుతూ ఉంటారు. అందువల్లే ప్రపంచ కప్ లో ఆడుతున్న అమెరికా టి20 జట్టు భారత, ఆసియా దేశాల సంతతి ఆటగాళ్లతో నిండిపోయింది. మొత్తం 15 మంది క్రీడాకారులలో భారత సంతతికి చెందిన వారు 8 మందికి చోటు లభించింది.
భారత జట్టుకు అండర్ 19 ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన ఉన్ముక్త్ చంద్ కు అమెరికా జట్టులో అవకాశం లభించలేదు. మోనాంక్ పటేల్ ఆధ్వర్యంలో అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, గజానంద్ సింగ్, సౌరవ్ నేత్రవల్కర్, జెస్సీ సింగ్, నిసర్గ పటేల్ వంటి వారు ఉన్నారు. ఉస్మాన్ రఫిక్, గౌస్ వంటి పాకిస్తాన్, ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లకు కూడా చోటు లభించింది.
హర్మీత్ సింగ్ కు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన అనుభవం ఉంది. 2012 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో అతడు ఒక సభ్యుడుగా ఉన్నాడు. మిలింద్ కుమార్ టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇక టి20 వరల్డ్ కప్ లో ప్రారంభ మ్యాచ్ కెనడా, అమెరికా మధ్య జరగగా.. ఆ మ్యాచ్లో అమెరికా జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పక్కా ప్రొఫెషనల్ జట్టు లాగా ఆట తీరు ప్రదర్శించింది.
ఇక కెనడా టి20 క్రికెట్ జట్టులోనూ భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. టి20 వరల్డ్ కప్ కు అర్హత సాధించేందుకు గత ఏడాది అక్టోబర్ బెర్ముడా జట్టు జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. తొలిసారిగా టి20 వరల్డ్ కప్ లో ఆడుతోంది. ఈ జట్టుకు 37 సంవత్సరాల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాద్ నాయకత్వం వహిస్తున్నాడు. మరో స్పిన్నర్ కలీం సనా కూడా కీలక ఆటగాడిగా ఉన్నాడు.. ఈ జట్టుకు శ్రీలంక సంతతికి చెందిన కెనడియన్ పుబుదు దస్స నాయకే కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.. భారత సంతతికి చెందిన హర్ష్ థాకర్, దిల్ ప్రీత్ బజ్వా, నికోలస్ కీర్టన్ వంటి వారు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.. పాకిస్తాన్, ఇతర ఆసియా దేశాల సంతతికి చెందిన జునైద్ సిద్ధికి, కన్వర్ పాల్ ఠాగూర్, నవనీత్ దాలివాల్, రవీందర్ పాల్ సింగ్, రయన్ పాల్ సింగ్, రేయాన్, హర్ష్ థాకర్, అమర్ ఖలీద్, ఆదిత్య వరదరాజన్, రాజేందర్ సింగ్, జతేందర్ మతార్ వంటి క్రీడాకారులు కెనడా క్రికెట్ జట్టులో కీలకంగా ఉన్నారు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో నవనీత్ దాలివాల్ అర్థ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.