T20 World Cup 2024: 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా – ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. (2003లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఇలాగే ఓడిపోయింది.) దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యాడు. దీని తర్వాత జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇలా వరుస ఓటములతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే టీమ్ ఇండియా భయపడే పరిస్థితి అభిమానుల్లో నెలకొంది. ఇక టి20 వరల్డ్ కప్ లో సూపర్ -8 దశలో టీమిండియా – ఆస్ట్రేలియా తలపడ్డాయి.. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. దర్జాగా సెమీఫైనల్ వెళ్ళింది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది.
టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని అందుకున్నాడు. పలు సందర్భాలలో ట్రోఫీని ప్రదర్శించాడు. అయితే ట్రోఫీపై దుమ్ము పడినట్టు గుర్తించి.. తన చేతిలో ఉన్న కర్చీఫ్ తో అ దుమ్ము తుడిచాడు. ఆ ట్రోఫీని అత్యంత జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడు మాత్రమే కాదు టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు మొత్తం టి20 వరల్డ్ కప్ ట్రోఫీని ఒక పాపాయి లాగా చేతుల్లో పట్టుకున్నారు.. ముంబైలో జరిగిన సన్మాన సభలో ట్రోఫీని కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి మొదలు పెడితే సిరాజ్ వరకు గర్వంతో ప్రదర్శించారు. ప్రతి ఒక్క ఆటగాడు ఆ ట్రోఫీని ముద్దు పెట్టుకున్నారు. క్రికెట్ ఆటను ఒక మతం లాగా పాటించే మన దేశంలో.. ఆ క్రీడకు అత్యంత విలువ ఇస్తారు. మన దేశం ఏదైనా ట్రోఫీ గెలిస్తే ఎగిరి గంతేస్తారు.
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో సింహభాగం కప్ లు దక్కించుకున్న ఆస్ట్రేలియాలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఆ జట్టు ఆటగాళ్లు ట్రోఫీలను ఏమాత్రం లెక్క చేయరు. గత ఏడాది మనదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా.. ట్రోఫీ దక్కించుకుంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ ఆ ట్రోఫీ ఫై తన రెండు కాళ్ళను పెట్టాడు. అప్పట్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలో అప్పుడు షాన్ మార్ష్ వన్డే వరల్డ్ కప్ పై రెండు కాళ్ళను పెట్టుకుని ఉన్న ఫోటోను.. రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ పై పడిన దుమ్మును తుడిచే ఫోటోను పోల్చుతూ ఓ నెటిజన్ వీడియో రూపొందించాడు. “ఇదీ క్రికెట్ పై మాకు ఉన్న నిబద్దత. ఇదే టీమ్ ఇండియాకు – ఆస్ట్రేలియాకు ఉన్న తేడా” అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది.