T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఏకంగా సూపర్ -8 కు చేరుకుంది..2021 లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా.. మరోసారి అదే స్థాయిలో ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ – డీ లో ఆస్ట్రేలియా తర్వాత ఏ జట్టు సూపర్ – 8 కు చేరుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ ఉన్నాయి.. ఒకవేళ ఇంగ్లాండ్ సూపర్ -8 చేరుకోవాలంటే జూన్ 16న ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరిగే మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడిపోవాలి. అయితే ఇక్కడే ఆస్ట్రేలియా అసలు పన్నాగాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ ఫైన్ వెల్లడించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఫైన్ ఎలాంటి ఒక వ్యాఖ్యలు చేశాడంటే..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఫైన్ ఏమన్నాడంటే.. “నేను ఆస్ట్రేలియా ఓడిపోవాలని కోరుకోవడం లేదు. ఇదే దశలో స్కాట్లాండ్ దారుణంగా ఓడిపోకూడదు.. స్కాట్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆస్ట్రేలియా ఎదుట 140 పరుగుల లక్ష్యాన్ని ఉంచితే.. దానిని ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో చేదిస్తే చాలు. అప్పుడు స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ పెద్దగా ప్రభావితం కాదు. ఇంగ్లాండ్ జట్టు మాత్రం తను ఆడే చివరి మ్యాచ్ లో 50 కి పైగా రన్స్ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడే స్కాట్లాండ్ రన్ రేట్ కు దగ్గరగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదని” ఫైన్ వ్యాఖ్యానించాడు.
ఏం జరుగుతుంది?
ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని మార్చాలని క్రికెటర్లు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తే.. తదుపరి చర్యలకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. స్కాట్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అలా చేస్తే కచ్చితంగా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.11 ప్రకారం తక్కువలో తక్కువ రెండు మ్యాచ్ ల్లో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా సూపర్ -8 కు చేరుకుంది. ఆ తర్వాత ఆడబోయే మూడు మ్యాచ్లలో రెండింటికి మార్ష్ దూరం కావాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటుందనుకోవడం లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్లు గెలిచింది. 6 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. స్కాట్లాండ్ కూడా ఐదు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడింది. రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు తన చివరి మ్యాచ్ జూన్ 16న ఆస్ట్రేలియా తో ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిస్తే ఎదగా ఇబ్బంది ఉండదు. భారీ తేడాతో కనుక ఓడిపోతే ఇబ్బందులు తప్పవు. ఇక ఈ గ్రూపులో నమీబియా, ఒమన్ జట్లకు ఎలాంటి అవకాశాలు లేవు. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కూడా ఇదే గ్రూపులో ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు రెండు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో ఓడిపోయింది. మరొక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇక ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్లను నమీబియా, ఒమన్ జట్లతో ఆడుతుంది. ఒకవేళ ఈ రెండిట్లో గెలిచినా స్కాట్లాండ్ +2.164 నెట్ రన్ రేట్ ను ఇంగ్లాండ్ (-1.800 ప్రస్తుతం) అధిగమించడం కష్టం. ఒకవేళ అలా జరగాలంటే ఇంగ్లాండ్ తన చివరి రెండు మ్యాచ్లను భారీ తేడాతో గెలవాలి.. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో స్కాట్లాండ్ భారీ పరుగుల తేడాతో ఓడిపోవాలి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కొద్ది పరుగుల తేడాతో గెలిస్తే మాత్రం ఇంగ్లాండ్ జట్టు ఇంటికి వెళ్లక తప్పదు.