India Vs England: నౌషద్ ఖాన్.. క్రికెట్ లో ఈ పేరు సుపరిచితం కాకపోవచ్చు కానీ.. రంజి క్రికెట్ ఆడే వారికి ఈ పేరు స్మరణీయమే. రంజీలలో అతడు చూపినప్పటికీ సీనియర్ జట్టులో సంపాదించుకోలేకపోయాడు. తనలాగే తన పిల్లలు కావద్దని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా వారు తన శిక్షణలో రాటు దేరారు. వారిలో ఒకరు టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకోగా.. మరొకరు అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో ఆడారు. టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్న ఆయన పెద్ద కొడుకు తొలి మ్యాచ్ లోనే సత్తా చూపించాడు. దురదృష్టవశాత్తు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. లేకుంటే కథ వేరే విధంగా ఉండేది. ఈ స్టోరీ మొత్తం సర్ఫ రాజ్ తండ్రి గురించే..
గురువారం రాజ్ కోట్ లో జట్టుతో మొదలైన మూడవ టెస్టులో సర్ఫ రాజ్ అవకాశం దక్కించుకున్నాడు. అతడు జట్టులో అవకాశం దక్కించుకునేందుకు రెండు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. జట్టులో స్థానం దక్కించుకున్న తర్వాత.. మైదానంలో అడుగుపెట్టేముందు సర్ఫ రాజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రోమన జహూర్ ను కలుసుకొని కన్నీరు పెట్టాడు. తన జీవిత లక్ష్యం నెరవేరింది అంటూ క్యాప్ చూపించాడు. ఆ క్షణంలో వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. నౌషద్ ఖాన్ తన కుమారుడు సర్ఫ రాజ్ ను ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సర్ఫ రాజ్ క్యాప్ అందుకున్న దృశ్యాలను తాను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టీం ఇండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కారణమని నౌషద్ ఖాన్ ప్రకటించాడు. ” నేను ముంబైలో ఉండాల్సిన వాడిని. నన్ను రాజ్ కోట్ వెళ్ళమని సూచించింది సూర్య కుమార్ యాదవ్. జీవితంలో ఇలాంటి క్షణాలు ఎప్పటికీ రావు. నన్ను ఒప్పించి పంపించాడు. వాస్తవానికి నా ఒంట్లో నలతగా ఉంది. ముంబైలోనే ఉండిపోవాలనిపించింది. కానీ సూర్య కుమార్ యాదవ్ వల్ల నా కోడలితో కలిసి రాజ్ కోట్ వచ్చాను. ఇలాంటి క్షణాలు మళ్ళీ రావని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వాటిని ఆస్వాదించాలని చెప్పాడు. ఆ దిశగా నన్ను ఒప్పించాడని” నౌషద్ ఖాన్ ఉద్వేగంగా చెప్పాడు.
రాక్ కోట్ టెస్ట్ మ్యాచ్ లో సర్ఫ రాజ్ 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా వ్యక్తిగత స్కోర్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు సర్ఫ రాజ్ రన్ ఔట్ అయ్యాడు. ఐతే సర్ఫ రాజ్ ఈ మ్యాచ్ లో వన్డే తరహా లో బ్యాటింగ్ చేశాడు. 48 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. ఆరంగేట్ర టెస్ట్ లో తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రెండవ ఇండియన్ బ్యాటర్ గా హార్దిక్ పాండ్యాతో కలిసి సంయుక్తంగా చరిత్రకెక్కాడు. ఇక వీరి కంటే ముందు 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించి యువరాజు సింగ్ తొలి స్థానంలో ఉన్నాడు.