India Vs South Africa Final: మ్యాచ్ ను మలుపు తిప్పిన క్యాచ్ అదే.. వీడియో వైరల్

అప్పటికి సౌత్ ఆఫ్రికా 19 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజ్ లో డేవిడ్ మిల్లర్(21: 17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) తో స్ట్రైకర్ గా ఉన్నాడు. అప్పటికి దక్షిణాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 10:46 am

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. పొట్టి ప్రపంచ కప్ ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.. హోరాహోరీ గా సాగిన మ్యాచ్ లో ఉత్కంఠ విజయం సాధించింది.. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్.. భారత జట్టును విజేతగా నిలిపింది.. సూర్య కుమార్ యాదవ్ కనుక క్యాచ్ పట్టక పోయి ఉంటే మ్యాచ్ మరో విధంగా ఉండేది.

అప్పటికి సౌత్ ఆఫ్రికా 19 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజ్ లో డేవిడ్ మిల్లర్(21: 17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) తో స్ట్రైకర్ గా ఉన్నాడు. అప్పటికి దక్షిణాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా ఉంది.. కెప్టెన్ రోహిత్ శర్మ చివరి ఓవర్ వేసే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. అప్పటికే కొన్ని సూచనలు చేశాడు. ఏదైతే అదయింది అనుకొని.. తొలి బంతిని హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ గా వేశాడు. అతడు ఊహించినట్టుగానే ఆ బంతిని డేవిడ్ మిల్లర్ బలంగా కొట్టాడు. అది అంత ఎత్తున గాల్లో లేచింది. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఆ బంతిని అందుకున్నాడు. బౌండరీ లైన్ కు వెంట్రుక వాసి దూరంలో పరుగులు తీస్తూ.. బంతిని మైదానంలోకి ఎగరేసి.. బౌండరీ లైన్ లోపలికి వెళ్లి.. మళ్లీ ఒక ఉదుటున జంప్ చేసి బంతిని అందుకున్నాడు. దీంతో డేవిడ్ మిల్లర్ కన్నీటి పర్యంతం అవుతూ మైదానాన్ని వీడాడు. ఈ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది.

ఎందుకంటే డేవిడ్ మిల్లర్ చివరి ఓవర్లలో దూకుడుగా ఆడతాడు. గతంలో దక్షిణాఫ్రికాకు అనేక విజయాలు అందించాడు. దక్షిణాఫ్రికా అప్పటికే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ.. విజయం పై నమ్మకంతో ఉందంటే దానికి కారణం మైదానంలో డేవిడ్ మిల్లర్ ఉండటమే.. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడం.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఒత్తిడికి గురి కావడంతో.. టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్.. కెప్టెన్ రోహిత్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు. మరోసారి తాను ఎంత కీలకమైన ఆటగాడినో నిజం చేసి చూపించాడు.

కపిల్ దేవ్ లాగానే సూర్య కూడా..

1983లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో.. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ సూర్య కుమార్ యాదవ్ లాగే వెనక్కి వెళ్లి క్యాచ్ అందుకున్నాడు.. కపిల్ దేవ్ పట్టిన ఆ క్యాచ్ టీమ్ ఇండియాను తొలిసారి వన్డే వరల్డ్ కప్ విజేతను చేసింది. మదన్ లాల్ బౌలింగ్లో వివియన్ రిచర్డ్స్ భారీ షాట్ కొట్టగా.. ఆ బంతిని అందుకునేందుకు కపిల్ దేవ్ వెనక్కి పరిగెత్తుతూ.. చివరికి తన రెండు చేతులతో ఒడుపుగా పట్టేశాడు. అంతే ఒక్కసారిగా స్టేడియంలో కేరింతలు మొదలయ్యాయి. రిచర్డ్స్ అవుట్ కావడంతో.. టీమిండియా వైపు మ్యాచ్ మొగ్గింది. సరిగ్గా శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో.. సూర్య కుమార్ యాదవ్ కూడా డేవిడ్ మిల్లర్ క్యాచ్ అలానే అందుకున్నాడు. వెంట్రుక వాసిలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టుకుని.. ఇండియా వైపు మొగ్గేలా చేశాడు.