https://oktelugu.com/

Special Status: బీహార్ కు ప్రత్యేక హోదా?.. చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి?

నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అడగడం ఇది తొలిసారి కాదు. గతంలోనే క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 30, 2024 / 09:42 AM IST

    Special Status

    Follow us on

    Special Status: ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా తెలుగుదేశం, జేడీయు ఉంది. ఈ రెండు పార్టీలకు ప్రధాని మోదీ ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ తో పాటు కీలక పదవులు ఆఫర్ చేస్తున్నారు. అయితే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్ కోరుతోంది. ఏకంగా ఒక తీర్మానం చేసి ప్రతిపాదించింది. ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. బీహార్ నుంచి ఈ తరహా ప్రతిపాదన రావడంతో.. చంద్రబాబుపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చంద్రబాబు ఎలా అడుగులు వేస్తారన్నది ప్రశ్నగా మిగిలింది.

    నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అడగడం ఇది తొలిసారి కాదు. గతంలోనే క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నితీష్ జాగ్రత్తపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి నెల రోజులు కాకముందే బీహార్ కు ప్రత్యేక హోదా కావాలంటూ నితీష్ తీర్మానం చేయడం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ప్రత్యేక హోదా వీలుకాకుంటే కనీసం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ తీసుకువచ్చారు నితీష్. దీంతో పాటుగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులను కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల్లో అక్రమాలు నియంత్రించడానికి పార్లమెంట్లో ప్రత్యేక, కఠిన చట్టాలు చేయాలని కూడా కోరారు.

    నితీష్ తాజా డిమాండ్లతో చంద్రబాబుపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విభజన నాటి నుంచే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. అదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని.. ఎక్కువమంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ సాధించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడం, ఎన్డీఏ లో కీలకంగా మారడంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటారని అంతా భావిస్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారా? గతం మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకుంటారా? అసలు చంద్రబాబు మనసులో ఉన్న మాటేంటి? అన్నది వెల్లడించాల్సి ఉంది. చంద్రబాబు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.