https://oktelugu.com/

Surya Kumar Yadhav : మిస్టర్ 360 మాత్రమే కాదు.. బంతితోనూ మాయ చేయగలడు.. సూర్య కుమార్ యాదవ్ ఘనతలివీ

ఇదే సమయంలో గౌతమ్ గంభీర్ కోచ్ గా నియమితుడయ్యాడు. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికతో శ్రీలంక లో భారత్ పర్యటించింది. 3 t20 మ్యాచ్ల సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసేసింది. ముఖ్యంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడనప్పటికీ.. బౌలింగ్లో మాత్రం అద్భుతాలు చేశాడు

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 31, 2024 / 07:03 PM IST
    Follow us on

    Surya Kumar Yadhav :  2012 ఐపీఎల్ సీజన్లో కోల్ కతా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్య కుమార్ యాదవ్. ప్రారంభంలో అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కోల్ కతా జట్టు యాజమాన్యం కూడా ఏదో పడి ఉంటాడులే అన్నట్టుగా తీసుకుంది. గౌతమ్ గంభీర్ మాత్రం అతడిలో మరో కోణాన్ని చూశాడు. అతడి ప్రతిభకు పదును పెట్టాడు. కోల్ కతా సారధిగా సూర్య కుమార్ యాదవ్ కు పదేపదే అవకాశాలు ఇచ్చాడు. ఫలితంగా సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.. గౌతమ్ గంభీర్ అవకాశాలు ఇవ్వడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా సూర్య కుమార్ రెచ్చిపోయాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా ఫోర్లు, జెర్సీ వేసుకున్నంత సులభంగా సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టాడు. మైదానం నలుమూలల్లో బంతిని పరుగులు పెట్టించాడు. ఫలితంగా మిస్టర్ 360 బిరుదును పొందాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను మించి టి20 లలో మెరుపులు మెరిపించాడు. 2012లో కోల్ కతా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోవడంలో సూర్య కుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఆ దెబ్బతో అతడి సుడి తిరిగింది. జాతీయ జట్టులోకి అవకాశం లభించింది. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ వెను తిరిగి చూసుకోలేదు. తనకే సాధ్యమైన సూపర్ బ్యాటింగ్ తో సూర్య కుమార్ యాదవ్ అలరిస్తున్నాడు. టి20 ర్యాంకింగ్స్ లో టాప్ లో కొనసాగుతూ ఔరా అనిపిస్తున్నాడు.

    మెరుగైన ప్రదర్శన

    ఇటీవల టి20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకొని భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడి పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. మిల్లర్ అవుట్ కావడంతో భారత జట్టు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఆ క్యాచ్ పట్టిన సూర్య కుమార్ యాదవ్ పై సర్వత్రా అభినందనల జల్లు కురిసింది. అయితే ఆ క్యాచ్ సూర్య కుమార్ యాదవ్ కెరియర్ ను మరో మలుపు తిప్పింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టి20 లకు విరామం ప్రకటించాడు. దీంతో టీమ్ ఇండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను బీసీసీఐ నియమించింది. ఇదే సమయంలో గౌతమ్ గంభీర్ కోచ్ గా నియమితుడయ్యాడు. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికతో శ్రీలంక లో భారత్ పర్యటించింది. 3 t20 మ్యాచ్ల సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసేసింది. ముఖ్యంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడనప్పటికీ.. బౌలింగ్లో మాత్రం అద్భుతాలు చేశాడు.

    బంతితో ఆకట్టుకున్నాడు

    ఈ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 137 రన్స్ చేసింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విఫలమయ్యాడు. గిల్ 39 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 26 రన్స్ కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.. శ్రీలంక బౌలర్లలో తీక్షణ మూడు, హసరంగ రెండు వికెట్లు పడగొట్టారు. 138 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 రన్స్ చేసింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వైపు వెళ్ళింది.. సూపర్ ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ బౌండరీ కొట్టి భారత్ ను గెలిపించాడు. అయితే అంతకుముందు చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య బౌలింగ్ వేశాడు. తొలి బంతిని డాట్ గా వేశాడు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటర్లు కామిందు మెండిస్, తీక్షణను పెవీలియన్ పంపించాడు. అయితే నాలుగ బంతికి శ్రీలంక ఆటగాడు అసిత సింగిల్ రన్ తీశాడు. విక్రమసింగే క్విక్ డబుల్స్ తీశాడు. దీంతో మ్యాచ్ టై అయింది. వాస్తవానికి ఆ ఓవర్ ను సూర్య అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టై అయింది. మెలి తిప్పే బంతులు వేస్తూ శ్రీలంక బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. రెండు వికెట్లు పడగొట్టి తాను మిస్టర్ 360 మాత్రమే కాదని.. బౌలింగ్ లోనూ వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడినని నిరూపించాడు. సూర్య కుమార్ యాదవ్ వికెట్లు పడగొట్టిన విధానానికి సంబంధించిన వీడియోను Sony LIV ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. అన్నట్టు కెప్టెన్ గా తొలి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు కోచ్ గౌతమ్ గంభీర్ ను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సరైన జోడి కుదిరింది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.