SRH Vs MI 2024: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ బుధవారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాదులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకుల కోసం మెట్రో, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సందడి నెలకొంది. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే మైదానంలోకి వస్తున్నారు. తొలి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయిన హైదరాబాద్.. సొంత మైదానంలో జరిగే మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది. ఆ జట్టు అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ జట్టుకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరి కళ్ళు హిట్ మాన్ రోహిత్ పైనే ఉన్నాయి. ఎందుకంటే అతడు చరిత్రకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ లో రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది.. ముంబై జట్టుకు 5 టైటిల్స్ అందించిన ఘనత అతడికి ఉంది. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడడం ద్వారా అతడు మరో రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున 200 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనతను రోహిత్ శర్మ తన పేరు మీద లిఖించుకోబోతున్నాడు.
ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ముంబై జట్టు తరఫున 200 మ్యాచ్ లు ఆడిన చరిత్ర లేదు. 2011 నుంచి రోహిత్ శర్మ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 199 మ్యాచ్ లు ఆడాడు. హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ ద్వారా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. 1999 మ్యాచ్ లలో రోహిత్ 5,084 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్నాడు. ఇక అత్యధిక మ్యాచ్ లు ఒకే జట్టు తరఫున ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడవ స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో విరాట్ కోహ్లీ బెంగళూరు తరఫున కొనసాగుతున్నాడు. అతడు ఏకంగా 239 మ్యాచ్ లు ఆడాడు.. అతని తర్వాత మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టు తరఫున 221 మ్యాచ్ లు ఆడి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మరి ఈ మ్యాచ్ లో రోహిత్ ఏ స్థాయిలో ఆడతాడో.. 200 వ మ్యాచ్ లో వీర విహారం చేయాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు.