SRH Vs PBKS 2024
SRH Vs PBKS 2024: హైదరాబాద్ పేరు పెట్టి.. తెలుగు క్రీడాకారులకు చోటు కల్పించరా.. ఇలా అయితే హైదరాబాద్ జట్టును ఆడనివ్వం.. ఉప్పల్ మైదానంలో అడ్డుకుంటాం.. కచ్చితంగా తెలుగు వాళ్లకు చోటు ఇవ్వాల్సిందే.. ఇది మొన్నటి చెన్నై జట్టుతో హైదరాబాద్ ఆడే మ్యాచ్ కు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన హెచ్చరిక. సహజంగానే ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పేరున్న నాయకుడు కావడంతో.. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకొని.. హైదరాబాద్ జట్టు తక్షణ నిర్ణయం తీసుకుంది. జట్టులో సరిగ్గా ఆడ లేకపోతున్న మయాంక్ అగర్వాల్ స్థానంలో నితీష్ రెడ్డి అనే తెలుగు కుర్రాడికి అవకాశం ఇచ్చింది.
అలా నితీష్ కుమార్ రెడ్డి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సహాయంతో 14 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఆ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించిన నేపథ్యంలో.. పంజాబ్ తో మంగళవారం నాటి మ్యాచ్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డిని కొనసాగించారు.. అయితే వచ్చిందే అవకాశం అనుకొని.. అతడు ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రం వంటి ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అయినప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా.. నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 37 బాల్స్ ఎదుర్కొని నాలుగు బౌండరీలు, 5 సిక్సర్ల సహాయంతో ఏకంగా 64 పరుగుల స్కోర్ సాధించాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో అవుట్ అయినప్పటికీ.. అప్పటికే హైదరాబాద్ జట్టు 150కి మించి పరుగులు చేసింది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గనుక నిలబడకపోయి ఉంటే హైదరాబాద్ 120 పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యేది.
కీలకమైన ఆటగాళ్లు వరుసగా అవుట్ అవుతున్నప్పటికీ.. నితీష్ కుమార్ రెడ్డి మొండి ధైర్యంతో నిలబడ్డాడు. పంజాబ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 120 పరుగులు కూడా చేయడం కష్టమే అని భావించినచోట.. ఏకంగా జట్టు 150 పరుగులకు మించి స్కోర్ చేసేలా ఆడాడు. అభిషేక్ శర్మతో 12, రాహుల్ త్రిపాఠితో 25, క్లాసెన్ తో 36, అబ్దుల్ సమద్ తో 50 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి హైదరాబాద్ జట్టు.. 182 పరుగులు సాధించేలా చేశాడు. నితీష్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. అతడి పేరుతో పాటు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్ హెచ్చరికల వల్లే హైదరాబాద్ జట్టు యాజమాన్యం నితీష్ రెడ్డికి చోటు కల్పించిందని.. ఫలితంగా అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ జట్టు యాజమాన్యం తెలుగోళ్ళ సత్తా గుర్తించాలని.. తెలుగు వాళ్ళకు ఆడే అవకాశం కల్పించాలని హితవు పలుకుతున్నారు.
Nitish Reddy reminds of young Rohit Sharma pic.twitter.com/7u5OaAfym3
— Nisha (@NishaRo45_) April 9, 2024