SRH Vs PBKS 2024
SRH Vs PBKS 2024: బంతి, బంతికి సమీకరణం మారిపోయింది. నిమిష, నిమిషానికి ఆటతీరు అంతు పట్టని తీరుగా సాగింది. మొత్తానికి ఉగాదినాడు అటు పంజాబీలకు, ఇటు తెలుగు వాళ్లకు టీ -20 మజా అంటే ఎలా ఉంటుందో అర్థమైంది. మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన టీ – 20 అసలు సిసలైన క్రీడా వినోదాన్ని ప్రేక్షకులకు పంచింది. చివరి నిమిషంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఎంత ఒత్తిడికి గురయ్యారో.. మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లు కూడా అంతే ఒత్తిడికి గురయ్యారు. రెండు పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది గాని.. అనుక్షణం ట్విస్టులే ట్విస్టులు ఈ మ్యాచ్ లో చోటుచేసుకున్నాయి.
పంజాబ్ జట్టు టాస్ గెలవడంతో ఈ మ్యాచ్ లో ముందుగా హైదరాబాద్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మైదానం ముందుగా బౌలర్లకు సహకరించడంతో హైదరాబాద్ బ్యాటర్ల పప్పులు పంజాబ్ ముందు ఉడకలేదు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి వచ్చేదాకా భారీ భాగస్వామ్యాలు నమోదు కాలేదు. అభిషేక్ శర్మ, హెడ్, మార్క్రం(గోల్డెన్ డకౌట్) వంటి వారు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఫలితంగా 100 పరుగుల లోపే హైదరాబాద్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులతో 64 పరుగులు చేసి మైదానంలో బ్యాట్ పరాక్రమం కొనసాగించాడు. అబ్దుల్ సమద్ 25 పరుగులతో అతడికి సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. హర్షల్ పటేల్, సామ్ కరణ్ రెండు వికెట్లు సాధించారు. రబాడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
తొలి 10 ఓవర్లు పంజాబ్ బౌలర్లకు సహకరించిన ఈ మైదానం.. హైదరాబాద్ బౌలర్ల విషయంలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఫలితంగా పంజాబ్ జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లు సామ్ కరణ్ 29, సికిందర్ రాజా 28, శశాంక్ సింగ్ 46*, అషుతోష్ శర్మ 33* పరుగులతో రాణించడంతో పంజాబ్ జట్టు గెలుపు వాకిట్లో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు..
183 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన పంజాబ్ జట్టుకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ వేసిన రెండవ ఓవర్లో జానీ బెయిర్ స్టో 0 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు భువనేశ్వర్ వరుస ఓవర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (4), శిఖర్ ధావన్ (14) ను అవుట్ చేశాడు. ధావన్ కీపర్ క్లాసెన్ చేసిన స్టంపింగ్ తో అవుట్ అయ్యాడు. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో సామ్ కరణ్, సికిందర్ రాజా నిదానంగా ఆడారు. వీరిద్దరూ పాతుకుపోయారు. ఈ క్రమంలో నటరాజన్ కరణ్ ను అవుట్ చేసాడు. సికిందర్ రాజాను జయదేవ్ పెవిలియన్ పంపించాడు. ధాటిగా ఆడుతున్న జితేష్ శర్మ ను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. ఈ క్రమంలో శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ దూకుడుగా ఆడారు. ఫలితంగా మ్యాచ్ ఉత్కంఠ గా మారింది.
పంజాబ్ గెలుపు సమీకరణం
12 బంతుల్లో 39 పరుగులకు మారిన నేపథ్యంలో నటరాజన్ వేసిన 19 ఓవర్లో అషుతోష్, శశాంక్ చెరో ఫోర్ బాదారు. చివరి ఓవర్ లో పంజాబ్ జట్టు విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ ఓవర్ జయదేవ్ వేశాడు. అతడు వేసిన తొలి బంతిని అషుతోష్ సిక్స్ కొట్టాడు. మరో బాల్ ను కూడా అదే స్థాయిలో బాదాడు. అయితే ఈ రెండు బంతులు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ లు గా రాగా, హైదరాబాద్ ఫీల్డర్లు వదిలేసారు. చివరి రెండు బంతుల్లో పంజాబ్ జట్టు విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. అయితే జయదేవ్ 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో హైదరాబాద్ రెండు రన్స్ తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ లో ఒత్తిడి వల్ల హైదరాబాద్ ఆటగాళ్లు మూడు క్యాచ్ లను నేలపాలు చేయడం విశేషం. మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా అసలు సిసలైన టి20 మజాను ఇరుజట్ల ఆటగాళ్లు ప్రేక్షకులకు అందించారు. ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ సరైన నెట్ రన్ రేట్ లేని కారణంగా హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోనే కొనసాగుతోంది.