Homeక్రీడలుSunrisers Hyderabad Brian Lara: మరో బిగ్ వికెట్ ఔట్.. సన్ రైజర్స్ కథ మారేదెప్పుడు?

Sunrisers Hyderabad Brian Lara: మరో బిగ్ వికెట్ ఔట్.. సన్ రైజర్స్ కథ మారేదెప్పుడు?

Sunrisers Hyderabad Brian Lara: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేసింది. ఏ దశలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేక ఆటగాళ్లు చేతులు ఎత్తేశారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ సీజన్లో అయితే జట్టు ప్రదర్శన పతనావస్థకు చేరిపోయింది. దీంతో యాజమాన్యం జట్టును ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే జట్టులో కీలకమైన వ్యక్తిపై వేటు వేసేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది.

హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్ గా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా వ్యవహరిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా జట్టుతో లారా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సానుకూల ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది హైదరాబాద్ జట్టు దారుణమైన ఆట తీరును కనబరిచింది. 14 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో హైదరాబాద్ జట్టు పై అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లతోపాటు కోచ్ పనితీరుపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్న యాజమాన్యం గత కొన్నాళ్ల నుంచి హెడ్ కోచ్ గా పని చేస్తున్న లారాపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు పూర్తి చేసిన యాజమాన్యం లారాపై వేటు వేసింది. అయితే, అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడాల్సి ఉన్నట్లు చెబుతున్నారు.

ఆటగాళ్లపై కూడా వేటు పడే అవకాశం..

హెడ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టు మెరుగైన ఫలితాలను సాధించకపోవడంపై ఆ జట్టు యజమాని కావ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. హెడ్ కోచ్ ను మారిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని భావించిన ఆమె ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగానే లారాను తప్పించినట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ లారా స్థానంలో భారతదేశానికి చెందిన సీనియర్ రిటైర్డ్ క్రికెటర్ ను తీసుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఆశించిన స్థాయిలో ఈ ఏడాది ప్రదర్శన చేయలేకపోయినా పలువురు ఆటగాళ్లను కూడా తప్పించే యోచనలో జట్టు యజమాని కావ్య ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన బ్రూక్, మయాంక్ అగర్వాల్, ఆడెన్ మార్క్రమ్ వంటి ఆటగాళ్లపైన వేటు వేసేందుకు యజమాని కావ్య సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరిపై ఒకేసారి వేటు వేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న యాజమాన్యం.. ముందుగా 10 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన బ్రూక్ పై వేటు వేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. అలాగే, వచ్చే ఏడాది స్వదేశానికి చెందిన యంగ్ ప్లేయర్స్ ని కూడా జట్టులో చేర్చుకునే దిశగా యాజమాన్యం ఆలోచన చేస్తుంది. వచ్చే సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జట్టు యాజమాన్యం ముందుకు వెళుతోంది.

లారాను తప్పించడం వెనుక కారణం అదేనా..?

హెడ్ కోచ్ గా పని చేస్తున్న బ్రియాన్ లారాను తప్పించడం వెనుక ముఖ్యమైన కారణం ఉన్నట్లు చెబుతున్నారు. లారా ఒకప్పటి టెస్ట్, వన్డే తరహా ఆలోచనలో ఉంటూ అటువంటి వారిని జట్టులో ఆడిస్తున్నాడనే అభిప్రాయం యాజమాన్యంలో ఉంది. దీంతోపాటు జట్టు సమావేశాల్లో కూడా లారా జోక్యం ఎక్కువ కావడం వల్ల కెప్టెన్ మార్క్రమ్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో మొన్నటి సీజన్ లో ఇబ్బందులు ఎదురైనట్టు యాజమాన్యం భావిస్తోంది. టీమ్ ఎంపికలోనూ లారా ఎక్కువ ఇన్వాల్వ్ కావడం వల్ల గతంలోనే మార్క్రమ్ అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని జట్టు పరిగణలోకి తీసుకుంది. కెప్టెన్ కు, హెడ్ కోచ్ కు సానుకూలమైన వాతావరణం లేకపోతే ఈ తరహా ఫలితాలే వస్తాయని భావిస్తున్న యాజమాన్యం లారాను తప్పించేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని భావిస్తోంది. మొదట హైదరాబాద్ జట్టుకి బ్యాటింగ్ కన్సల్టెంట్ గా లారా వ్యవహరించాడు. టామ్ మూడీ హెడ్ కోచ్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను లారాకు జట్టు యాజమాన్యం అప్పగించింది. లారాను కోచ్ గా పెట్టుకున్నప్పటికీ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడంతో వేటు వేస్తోంది. యువ ఆటగాళ్లపై నమ్మకాన్ని పెట్టుకుని.. వార్నర్ వంటి సీనియర్ ఆటగాళ్లను దూరం చేసుకోవడం ద్వారా హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వచ్చే సీజన్ నాటికి ఈ సమస్యలను పరిష్కరించుకొని కప్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగాలని భావిస్తున్న జట్టు యజమాని కావ్య.. ఆ దిశగా ప్రస్తుతం జట్టును ప్రక్షాళన చేసేందుకు సన్నద్ధం అవుతోంది. చూడాలి హైదరాబాద్ జట్టులో చేస్తున్న మార్పులు ఆ జట్టుకు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయో.

RELATED ARTICLES

Most Popular