SRH Vs KKR Final 2024: “మూడు” కోసం రెండు సమ ఉజ్జీల పోరు.. ఎవరు గెలిచినా చరిత్రే?

హైదరాబాద్ జట్టుకు కొన్ని మ్యాచ్లలో ఓపెనింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో హెడ్ లేదా అభిషేక్ శర్మ లో ఎవరో ఒకరు త్వరగా అవుట్ అవుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 26, 2024 8:26 am

SRH Vs KKR Final 2024

Follow us on

SRH Vs KKR Final 2024: ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటికే లీగ్, ప్లే ఆఫ్ దశలో ఈ రెండు జట్లు తలపడగా.. అప్పుడు కోల్ కతా విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలలో ఈ రెండు జట్లు సమానంగా ఉన్నాయి. దీంతో పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు నడుస్తుందని వ్యాఖ్యానాలు వినిపించినప్పటికీ.. దానిని కోల్ కతా ఆటగాళ్లు పూర్తి ఏకపక్షంగా మార్చేశారు. దీంతో ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ ఏం చేయబోతుందనేది ఒకింత ఉత్కంఠ గా మారింది. ఈ రెండు జట్లు ఇప్పటికే రెండుసార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. దీంతో ఈసారి గెలిచే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఐదు సార్లు విజేతలుగా అటు ముంబై, ఇటు చెన్నై జట్లు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా లేదా హైదరాబాద్ గెలిస్తే అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన రెండవ జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.

కోల్ కతా జట్టు దాదాపు పాతిక కోట్లు ఖర్చుపెట్టి మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేసింది. అయితే అతడు జట్టుకు అవసరమైన సమయంలో ఫామ్ లోకి వచ్చాడు. ఇది కోల్ కతా కు లాభించే విషయం. పైగా ప్లే ఆఫ్ మ్యాచ్ లో అతడు సత్తా చాటాడు.. ఫైనల్ మ్యాచ్ లోనూ అతడు అదేవిధంగా ప్రతిభ చూపుతాడని కోల్ కతా జట్టు యాజమాన్యం భావిస్తోంది. స్టార్క్ మాత్రమే కాకుండా, మిగతా ఆటగాళ్లు కూడా ఫామ్ లో ఉండడం కోల్ కతా జట్టుకు కలిసొచ్చే అంశం.

హైదరాబాద్ జట్టుకు కొన్ని మ్యాచ్లలో ఓపెనింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో హెడ్ లేదా అభిషేక్ శర్మ లో ఎవరో ఒకరు త్వరగా అవుట్ అవుతున్నారు. ఈ ఐపీఎల్లో పవర్ ప్లే లో ఏకంగా 125 పరుగులు చేసిన చరిత్ర హైదరాబాద్ జట్టు సొంతం. కానీ ఇంతవరకు ఆ జట్టు ఆటగాళ్లు ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోతున్నారు.

ఇక చెపాక్ మైదానం మందకొడిగా మారడంతో.. స్పిన్నర్లకు స్వర్గధామం లాగా మారింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో 175 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. ఆ స్కోరును కాపాడుకుందంటే దానికి కారణం స్పిన్నర్లే. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ వంటి వారు రాణించే అవకాశం ఉంది. వీరి వల్ల ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడక తప్పదు. క్రీజ్ లో కుదురుకుంటే తప్ప బ్యాటర్లకు పరుగులు చేసే పరిస్థితి ఉండదు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ కు హైదరాబాద్.. ఇలా అనేక ఘనతలను పాట్ కమిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లలో ఆస్ట్రేలియా జట్టును కమిన్స్ విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ లో హైదరాబాదును గెలిపిస్తే.. అతడు హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకుంటాడు.

కోల్ కతా – హైదరాబాద్ ఇప్పటివరకు 27 సార్లు తలపడ్డాయి. కోల్ కతా 18, హైదరాబాదు 9 మ్యాచ్ లలో గెలిచాయి. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య లీగ్, ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరిగాయి. వాటిల్లో కోల్ కతా విజయం సాధించింది.

తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలింగ్ ను కోల్ కతా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ చిత్తు చేశారు. వీరిద్దరూ అజయమైన అర్థ సెంచరీలు సాధించారు. అయితే వీరిని ఎంత త్వరగా అవుట్ చేస్తే, హైదరాబాద్ జట్టుకు అంత లాభం. సునీల్ నరైన్ కూడా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.

చెన్నై మైదానంలో జరిగిన గత ఎనిమిది మ్యాచ్లలో.. ఆరుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. మైదానం మందకొడిగా మారిన నేపథ్యంలో.. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ కు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అక్కడ వాతావరణం మేఘావృతం కావడంతో వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే ఫలితం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. సోమవారం నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే కోల్ కతా జట్టు విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో హైదరాబాద్ కంటే కోల్ కతా కే ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఆ జట్టునే విజేతగా నిర్ణయిస్తారు.

తుది జట్ల అంచనా ఇలా

హైదరాబాద్

హెడ్, అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీష్ కుమార్, షాబాజ్ అహ్మద్, కమిన్స్( కెప్టెన్), భువనేశ్వర్, నటరాజన్, జయదేవ్.

కోల్ కతా

సునీల్ నరైన్, రెహమానుల్లా, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రస్సెల్, రింకూ సింగ్, రమణ్ దీప్, స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.