SRH Vs PBKS: ఐపీఎల్(IPL)లో 220 స్కోర్ అంటే మామూలు విషయం కాదు. ఈ పరుగులను డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ అదేం దరిద్రమో అర్థం కావడం లేదు.. సన్ రైజర్స్ (SRH vs PBKS) బౌలర్లకు ఏమైందో తెలియడం లేదు. బ్యాటర్లు దుమ్మురేపినప్పటికీ.. బీభత్సంగా పరుగులు తీసినప్పటికీ బౌలర్లు చేతులెత్తయడంతో.. హైదరాబాద్ జట్టు(Sun risers hyderabad) ఈ ఐపీఎల్ లో మరో ఓటమిని మూట కట్టుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మరింత అధమ స్థానానికి చేరుకుంది.
న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ జట్టుతో హైదరాబాద్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆడింది. ఏకంగా 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ముందు ఉంచింది. ఇంత భారీ స్కోరు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టు గెలుస్తుందని అభిమానులు అంచనా వేశారు. కానీ పంజాబ్ బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశారు. వికెట్ల సంగతి అలా ఉంచితే.. కనీసం పరుగులు ఆపడంలో కూడా హైదరాబాద్ బౌలర్లు ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు. స్లాగ్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేస్తే.. హైదరాబాద్ బౌలర్లు మాత్రం మొత్తానికి మొత్తమే చేతులెత్తేశారు.
హైదరాబాద్ విధించిన 220 పరుగుల భారీ స్కోరును కూడా పంజాబ్ ఫినిష్ చేసి పడేసింది. అది కూడా కేవలం 18.5 ఓవర్లలోనే పూర్తి చేయడం విశేషం. పంజాబ్ జట్టులో ప్రియాంష్ 57, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 51 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్(Shreyas iyer)(69*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తునా తునకలు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో శివంగ్ 3 వికెట్లు పడగొట్టాడు.. హర్ష్ దూబే ఒక వికెట్ సాధించాడు. ఇక మిగతా బౌలర్లు దారుణంగా బౌలింగ్ వేశారు. వికెట్లు తీయడం కాదు కదా.. బ్యాట్ మీదికి బంతులు వేసి.. కొట్టుకోండి అన్నట్టుగా పంజాబ్ బౌలర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని పంజాబ్ బ్యాటర్లు అద్భుతంగా వినియోగించుకున్నారు.
సరిగా వారం క్రితం సొంతమైదానంలో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం తో పాటు.. బౌలింగ్ లోపం కూడా స్పష్టంగా కనిపించింది. దీంతో సొంత మైదానంలో హైదరాబాద్ ఓడిపోయింది. పంజాబ్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్లో భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడంతో హైదరాబాద్ జట్టు బౌలర్ల మీద విమర్శలు వస్తున్నాయి. ఒకరిద్దరు మినహా మిగతా బౌలర్లు అంతగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో వచ్చే మ్యాచ్ లోనైనా హైదరాబాద్ గెలవాలని.. సన్ రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు.