Sunrisers : ఇక ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్ లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓన్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ పై రెచ్చిపోయింది. ఏకంగా 286 రన్స్ చేసింది.. దీంతో ఈసారి హైదరాబాద్ ఆటగాళ్లు 300+ స్కోర్ చేస్తారని అందరూ అనుకున్నారు. అంతేకాదు కప్ కూడా కొడుతుందని భావించారు. పైగా తొలి మ్యాచ్లో 44 రన్స్ వ్యత్యాసంతో రాజస్థాన్ రాయల్స్ పై విజయ దుందుభి మోగించింది హైదరాబాద్ జట్టు. ఆటగాళ్లు కూడా బీభత్సంగా ఆడే వాళ్ళు కావడంతో.. హైదరాబాద్ జట్టుపై అభిమానులు మాత్రమే కాదు.. క్రికెట్ విశ్లేషకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత సీజన్లో కప్ వదిలేసిందని.. ఈసారి కప్ ను కచ్చితంగా పట్టుకుంటుందని ఓ రేంజ్ లో వ్యాఖ్యలు చేశారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎదురయింది. వరుస ఓటములు హైదరాబాద్ జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేశాయి. దీంతో హైదరాబాద్ జట్టు పరిస్థితి అంతకంతకు దిగజారింది. ఒకానొక దశలో పాయింట్ల పట్టికలో కిందకు వెళ్ళిపోయింది. ఈ దశలో పంజాబ్ జట్టుతో సాధించిన విజయం హైదరాబాద్ జట్టులో జవసత్వాన్ని నింపింది. ఆ తర్వాత మళ్లీ రెండు ఓటములు ఎదురయ్యాయి. అయితే ఈసారి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి కాస్తఅవకాశాలను పదిలం చేసుకుంది హైదరాబాద్ జట్టు. ఆ విజయం తర్వాత మళ్లీ ఓటమి ఎదుర్కొంది. ఈ దశలో జరిగే మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు అత్యంత ముఖ్యంగా మారింది.
Also Read : కొత్త విమానమైనా.. సన్ రైజర్స్ రాత మార్చుతుందా..
బౌలింగ్ బాగున్నప్పటికీ
ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఈ సీజన్లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టుపై ప్రారంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఏమాత్రం నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా దూకుడుగా బౌలింగ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన పది మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తే.. ఈ మ్యాచ్లో మాత్రం వికెట్లు పడగొట్టారు. మొత్తంగా ఢిల్లీ జట్టు పై విజయం సాధించే విధంగా కనిపించారు. కానీ ఈ క్రమంలోనే వర్షం కురవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వర్షం కురుస్తుందని భావించినప్పటికీ.. అలాంటి ఛాయలు కనిపించలేదు. పైగా అవుట్ ఫీల్డ్ అత్యంత దారుణంగా ఉండడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభించాయి. అయితే అవి ప్లే ఆఫ్ వెళ్లడానికి ఏమాత్రం ఉపకరించకపోవడంతో.. అఫీషియల్ గానే హైదరాబాద్ జట్టు గ్రూప్ దశలోనే ఆగిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి వర్షం కురవకుంటే హైదరాబాద్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కచ్చితంగా ఆ జట్టు మ్యాచ్ గెలిచేది. ప్లే ఆఫ్ ఆశలను కాస్త సజీవంగా ఉంచుకునేది. ఇక మిగతా మూడు మ్యాచ్ల్లోనూ ఇదే తీరుగా ఆట తీరు ప్రదర్శిస్తే హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్ళేది. తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్టు.. హైదరాబాద్ ఒకరకంగా అంచనా వేస్తే.. వర్షం మరో విధంగా అంచనా వేసింది. ఫలితంగా హైదరాబాద్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
Also Read : నాలుగు పరాజయాలు వరుసగా.. SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే..