SRH Vs RR: గత సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. అయితే ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని.. విజేతగా నిలవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే తన ఆట తీరును పూర్తిగా మార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 6 వికెట్లు లాస్ అయ్యి 286 రన్స్ చేసింది.. అంతేకాదు మిగతా ఎనిమిది జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. గత సీజన్లో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్లు లాస్ అయ్యి 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఇక ఐపీఎల్ 18 ఎడిషన్ నిన్న ప్రారంభం కాగా.. మరుసటిరోజే హైదరాబాద్ జట్టు సంచలనం సృష్టించింది. ఏకంగా 286 రన్స్ చేసి తన రికార్డు తానే బ్రేక్ చేసుకోవడానికి ప్రయత్నించింది.
Also Read: క్షణం క్షణం ఉత్కంఠ.. సీట్ ఎడ్జ్ మ్యాచ్ అంటే ఇది..
అంతేకాదు గత సీజన్లో ముంబై ఇండియన్స్ పై హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసింది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ స్కోర్లు చేసిన రికార్డులు హైదరాబాద్ చెట్టు పేరు మీదనే ఉండడం విశేషం. ఇప్పటివరకు ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ లు చేసిన రికార్డులు ఆరు నమోదు కాగా.. అందులో హైదరాబాద్ జట్టు పేరు మీదనే నాలుగు ఉన్నాయంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 200 పరుగులు చేసిన జాబితాలోను హైదరాబాద్ జట్టు తనదైన రికార్డును ప్రదర్శిస్తోంది. ఈ జాబితాలో బెంగళూరు జట్టు పంజాబ్ జట్టుతో 2016లో జరిగిన మ్యాచ్లో 14.1 ఓవర్లలోనే 200 మార్క్ అందుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్ లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 14.1 ఓవర్లలోనే 200 స్కోర్ ను చేసింది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు పై 14.4 ఓవర్ల లోనే హైదరాబాద్ 200 పరుగులు చేసింది . ఇక ఇదే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 14.5 ఓవర్లలో హైదరాబాద్ 200 పరుగులు చేసింది. రెండో మ్యాచ్ లోనే ఆకాశమే హద్దు లాంటి ఆట తీరును ప్రదర్శించిన హైదరాబాద్.. తదుపరి మ్యాచ్లలో ఎలా ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాలుగు సార్లు..
టి20 లలో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. నాలుగు సార్లు హైదరాబాద్ జట్టు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి.. టి20 లలో ఈ ఘనత సాధించిన జట్టుగా మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత సర్రే జట్టు మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి రెండవ స్థానంలో ఉంది. ఇక టీమ్ ఇండియా మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇలా పరుగుల వరద పారించడం ద్వారా హైదరాబాద్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో మిగతా తొమ్మిది జట్లకు గట్టి హెచ్చరికలు పంపుతోంది. చూడాలి మరి మిగతా జట్లు ఎలా రెస్పాండ్ అవుతాయో.