Cricket Women’s World Cup 2025: క్రికెట్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో నిన్న ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఎదుర్కొన్న ఓటమిని ఎవరూ మర్చి పోలేకపోతున్నారు. వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్టు భారీ స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వచ్చిన బ్యాటర్లు క్యూ కట్టారు. ఏదో పని ఉందన్నట్టుగా.. తమకు ఆడ టం చేతకాదన్నట్టుగా వెళ్లిపోయారు. ఇంగ్లాండ్ మహిళా బౌలర్లు దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. స్మిత్ 3 వికెట్లు, బ్రాంట్, డీన్, ఎకిలీ స్టోన్ వంటి బౌలర్లు తలా రెండు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా 69 పరుగులకే కుప్ప కూలిపోయింది. దక్షిణాఫ్రికా జట్టలో వికెట్ కీపర్ సినాలీజోఫా చేసిన 22 పరుగులే హైయెస్ట్ స్కోర్ అంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఇంత తక్కువ స్థాయి స్కోరు నమోదు చేసి దక్షిణాఫ్రికా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద సృష్టించుకుంది.
ఆ తర్వాత 70 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండు జట్టు ఆడుతూ పాడుతూ చేదించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించి.. 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తద్వారా ఉమెన్స్ వరల్డ్ కప్ లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. అయితే ఈ గెలుపు తర్వాత ఇంగ్లాండ్ జట్టులో ఆనందం తారాస్థాయికి చేరుకోగా.. దక్షిణాఫ్రికా జట్టులో నిరాశ మరింత పెరిగింది. ఈ ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వర్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ లో ఓటమి తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని.. ఈ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని ఆమె విశ్లేషించారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఏడవ తేదీన ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ మహిళల జట్టుతో పోటీపడుతుంది. ఈ పోటీ కంటే ముందు తమ జట్టు అన్ని విభాగాలలో మెరుగుపడాల్సిన అవసరం ఉందని లారా పేర్కొంది. “తొలి మ్యాచ్ ఓటమి మాలో నిరాశను పెంచింది. వాస్తవానికి ఈ స్థాయిలో ఓటమి లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. దీనివల్ల మా జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ ఓటమి నుంచి మేము కచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటాం. దానిని తదుపరి మ్యాచ్లో పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఇప్పటికే మా మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. వాటన్నింటికీ కచ్చితంగా ఆట ద్వారా సమాధానం చెబుతామని” లారా పేర్కొంది.. వాస్తవానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉమెన్స్ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టుపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను నిలుపుకోవడంలో ఆ జట్టు విఫలం కావడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.