Sri Lanka Vs Afghanistan: సెంచరీలతో మోత.. ఏం మ్యాచ్ రా బాబూ.. శ్రీలంకను షేక్ చేసిన అప్ఘన్.. చివర్లో అదిరే ట్విస్ట్

మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుక్రవారం శ్రీలంక లోని పల్లె కిలె వేదికగా శ్రీలంక జట్టు ఆఫ్గనిస్తాన్ తో వన్డే మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగుల వరద పారించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 10, 2024 1:32 pm

Sri Lanka Vs Afghanistan

Follow us on

Sri Lanka Vs Afghanistan: పరుగుల వరద.. ఫోర్ల మోత. సిక్సర్ల ఊచకోత.. సెంచరీల కలబోత.. ఇంతకంటే ఎక్కువ ఉపమానాలు వాడొచ్చు. ఎన్ని వాడినా కూడా ఈ మ్యాచ్ ముందు దిగదుడుపే. ఒక జట్టు ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తే.. మరో జట్టు ఆటగాళ్లు ఆ లక్ష్యాన్ని చేదించేందుకు తుది వరకు పోరాడారు. ఆ రెండు జట్ల ఆటగాళ్ల ఆట తీరు చూసిన తర్వాత “క్రికెట్ లో ఏదైనా జరుగుతుంది.. ఎలాగైనా జరుగుతుంది.. అలా జరిగితేనే క్రికెట్ అవుతుంది”. అని వెనుకటి రోజుల్లో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి.

మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుక్రవారం శ్రీలంక లోని పల్లె కిలె వేదికగా శ్రీలంక జట్టు ఆఫ్గనిస్తాన్ తో వన్డే మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగుల వరద పారించింది. ప్రారంభం నుంచి ముగింపు దాక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల మీద ఎదురు దాడికి పాల్పడింది. ముఖ్యంగా నిశాంక 139 బంతుల్లో 20 ఫోర్లు, 8 సిక్సర్ లతో 210 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. మొదట ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నిశాంక కు ఆవిష్క ఫెర్నాండో (80), సమర విక్రమ (45) తోడ్పాటు అందించారు. నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి శ్రీలంక 381 పరుగుల భారీస్కోర్ సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 2/79, నబీ 1/44 రాణించారు.

381 భారీ స్కోరు చేదించేందుకు ఆఫ్ఘనిస్తాన్ రంగంలోకి దిగింది. 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ అజ్మతుల్లా ఓమర్ జాయ్ కదం తొక్కాడు. 115 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 149 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇతనికి మహమ్మద్ నబీ తోడుగా నిలిచాడు. 130 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో అద్భుత పోరాటం చేసి 136 పరుగులు సాధించాడు. వీరిద్దరు అరో వికెట్ కు ఏకంగా 242 పరుగులు జోడించడం విశేషం. ఒకానొక దశలో ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు.. చివరి నిమిషంలో లంక బౌలర్లు ఆకట్టుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ఇక శ్రీలంక బౌలర్లలో మధుశాన్ 4/75, చమీర 2/55 ఆకట్టుకున్నారు.. అటు శ్రీలంక బ్యాటర్ నిశాంక డబుల్ సెంచరీ, ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అజ్మతుల్లా ఓమర్ జాయ్, మహమ్మద్ నబీ సెంచరీలు సాధించడంతో ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారిపోయింది. ఈ మ్యాచ్ గెలుపొందడం ద్వారా మూడు వన్డేల సిరీస్ లో శ్రీలంక 1_0 తేడాతో ముందడుగు వేసింది.