Virat Kohli
Virat Kohli: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. వరుసగా రెండోసారి కూడా ఫైనల్ చేరిన భారత జట్టు గతంలో మాదిరిగానే దారుణమైన ఆట తీరుతో ఓటమిపాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో భారత జట్టు ఓటమిపాలు కాగా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో 200కు పైగా పరుగులు తేడాతో దారుణమైన పరాభవాన్ని భారత జట్టు దక్కించుకుంది. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పదేళ్ల తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రూపంలో ఐసీసీ ట్రోఫీని భారత జట్టు ముద్దాడుతుందని భావించిన అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు అంతర్జాతీయ టోర్నీలో దారుణమైన ఆట తీరును కనబరుస్తోంది. తాజాగా అదే విధమైన ఆట తీరుతో డబ్ల్యూటిసి ఫైనల్ లో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో అన్ని వైపుల నుంచి భారత జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లీగ్ ఆటగాళ్లు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడలేరంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో పలువురు కీలక ఆటగాళ్లు తాజా ఓటమిపై పరోక్షంగా స్పందిస్తున్నారు.
నిశ్శబ్దం అనేది గొప్ప బలానికి మూలం అంటూ కోహ్లీ వ్యాఖ్య..
డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టుపై వస్తున్న విమర్శలపై ఆటగాళ్లు ఒక్కొక్కరు పరోక్షంగా స్పందిస్తున్నారు. తాజా విమర్శలు నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ.. ‘ నిశ్శబ్దం అనేది గొప్ప బలానికి మూలం’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఓటమి వల్ల తాము మౌనాన్ని దాల్చామని, భవిష్యత్తులో తాము బలమైన సమాధానాలను విజయాలతో చెబుతామన్న సంకేతాలను ఈ పోస్ట్ ద్వారా విరాట్ కోహ్లీ ఇచ్చినట్లు అయిందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే, మరో క్రికెటర్ సుబ్ మన్ గిల్ కూడా టెస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత వస్తున్న విమర్శలపై స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ‘నాట్ ఫినిష్డ్ (ఇంకా ముగిసిపోలేదు)’ అని ట్వీట్ చేశాడు. అంటే తమలోని సత్తాను చూపించే అవకాశాలు ఇంకా ఉన్నాయంటూ అర్థం వచ్చేలా గిల్ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఓటమి తరువాత పెద్ద ఎత్తున విమర్శలు..
డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓటమి తర్వాత భారత ఆటగాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారత జట్టుపై ఐపీఎల్ తీవ్రమైన ప్రభావం చూపించిందని పలువురు వ్యాఖ్యానిస్తుంటే.. ఐపీఎల్ వల్ల ఇండియా జట్టుకు గొప్పగా ఆడడాన్ని కూడా ఆటగాళ్లు మర్చిపోతున్నారు అంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు. లీగ్ లకు ఇచ్చే ప్రాధాన్యాన్ని దేశానికి ఇవ్వడం లేదని, అంకితభావం ఆటగాళ్లలో కొరవడం వల్లే కీలకమైన టోర్నీల్లో ఓటమిపాలు కావాల్సి వస్తుందని పలువురు అభిమానులు విమర్శిస్తున్నారు. విమర్శల పట్ల ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో అయినా టీమిండియా ఆట తీరు మారుతుందేమో.
Web Title: Silence is a source of great strength virat kohlis message after indias wtc final defeat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com