Shubman Gill: టీమిండియా యువ సంచలనం, గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలకమైన ఆటగాడు సుబ్ మన్ గిల్ వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి మరో జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్న గిల్.. ఈ జట్టును వదిలేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు గిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గుజరాత్ టైటాన్స్ నుంచి బయటకు వచ్చేయబోతున్న గిల్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆహ్వానం ఉన్నట్టు చెబుతున్నారు. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి హైదరాబాద్ జట్టులో గిల్ ను అభిమానులు చూడనున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు గడిచిన రెండు సీజన్లలో అద్భుత విజయాలను సాధించింది. గుజరాత్ ఓపెనర్ గా బరిలోకి దిగే ఈ యంగ్ గన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గొప్ప విజయాలను అందించి పెట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి ఏడాదే ట్రోఫీని కైవసం చేసుకుందంటే దానికి కారణం జట్టు సమిష్టి ప్రదర్శన కాగా, ఓపెనర్ అద్వితీయమైన ప్రదర్శన కూడా మరో కారణంగా చెప్పవచ్చు. వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ లో గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకుంది ఈ జట్టు. ఈ ఏడాది కూడా అత్యధిక పరుగులను చేసి ఆరంజ్ ట్రోపీ అందుకుని తన సత్తాను చాటి గుజరాత్ టైటాన్స్ కు గొప్ప విజయాలను అందించాడు గిల్. అటువంటి గిల్ వచ్చే ఏడాది నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరం కానుండడం గమనార్హం.
హైదరాబాద్ జట్టులో చేరనున్న సుబ్ మన్ గిల్..
గడిచిన రెండు సీజన్ల నుంచి గుజరాత్ జట్టుకు ఆడుతున్న.. ఈ జట్టు నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గుజరాత్ నుంచి బయటికి వచ్చేయాలని భావిస్తున్న గిల్.. హైదరాబాద్ జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టులో సభ్యుడిగానే కాకుండా హైదరాబాద్ జట్టు పగ్గాలను కూడా గిల్ దక్కించుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జట్టు యాజమాన్యం సుబ్ మన్ గిల్ కు ఆఫర్ ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ జట్టుతోపాటు పంజాబ్ కింగ్స్ కూడా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తామంటూ ఆఫర్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, గిల్ మాత్రం హైదరాబాద్ జట్టులో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలిసింది. ఇది కార్యరూపం దాలిస్తే మాత్రం హైదరాబాద్ జట్టు బలంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ట్రేడింగ్ ద్వారా తెచ్చుకునే అవకాశం..
ఈ రెండు జట్లు అందిస్తున్న ఆఫర్ కు గిల్ అంగీకరిస్తే ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి అతని తెచ్చుకునేందుకు ఈ రెండు జట్ల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. గిల్ కోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు, అవసరమైతే కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు కూడా ఈ జట్లు సిద్ధపడినట్లు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. ఈ రెండు జట్లు యాజమాన్యాలు బలమైన గిల్ ను జట్టులో చేర్చుకోవడం ద్వారా పటిష్టంగా మారవచ్చని భావిస్తుంటే.. గిల్ మాత్రం అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే గుజరాత్ టైటాన్స్ జట్టులో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ తాజాగా వచ్చిన ఆఫర్ పై సానుకూలంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫామ్ లో ఉన్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా, ప్రాంచైజీ సారధ్యం వహించడంతో టీమిండియా జట్టు కెప్టెన్ గా కూడా ఎదగవచ్చని గిల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండటం కూడా గిల్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జరగనున్న వరల్డ్ కప్ తర్వాత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మార్పుల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న గిల్ కు గొప్ప అవకాశాలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
డిప్యూటీగా అయినా గిల్ కు అవకాశం..
ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే, టెస్ట్ ఫార్మాట్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా టి20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 2023 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వన్డే ఫార్మాట్ కెప్టెన్ పగ్గాలు ఖాళీ అవుతాయి. ఈ స్థానాన్ని గిల్ లాంటి యంగ్ ప్లేయర్ కు కల్పించే అవకాశం ఉంది. ఒకవేళ కెప్టెన్ గా అవకాశం కల్పించకపోయినా డిప్యూటీ కెప్టెన్ గా అయిన అవకాశం లభిస్తుందని భావిస్తున్నాడు. అయితే, అంతకు ముందు కెప్టెన్సీ అనుభవం సంపాదించాలంటే ఐపీఎల్ లో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిల్ భావిస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే గుజరాత్ టైటాన్స్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 17 మ్యాచ్ ల్లో మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలతో 890 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచి తన సత్తాను చాటాడు.