Shubman Gill : “ఇంగ్లాండ్ గడ్డమీద అతని ప్రదర్శన బాగోలేదు. అసలు అతడిని సారధిగా ఎందుకు ఎంపిక చేశారు. జట్టులో చోటు ఎందుకు కల్పించారు.. అనుభవం లేదు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆటో తీరుఅంత గొప్పగా లేదు. ఇటువంటి వ్యక్తి చేతిలో జట్టును పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు.. ఇప్పటికే వరుస వైఫల్యాలు వచ్చాయి. ప్రస్తుతం 2025- 2027 వరకు జరిగే సుదీర్ఘ ఫార్మాట్ ఛాంపియన్ షిప్ మొదలైంది. ఇలాంటి తరుణంలో ఈ ప్రయోగాలు చేయడం ఎంతవరకు సమంజసం” గిల్ కు జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత మాజీ సీనియర్ ప్లేయర్ల నుంచి వచ్చిన విమర్శలు.
ఇప్పుడు ఆ విమర్శలు గాలిలో కొట్టుకుపోయాయి. సార్థకతలేని మాటలుగా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే తన మీద వచ్చిన విమర్శలకు.. తన మీద చేసిన ఆరోపణలకు తగ్గట్టుగానే సమాధానం చెప్పాడు టీమిండియా యువసారథి. కేవలం మాటలతో కాకుండా తన ఆటతీరుతో వారందరి నోళ్లు మూయించాడు. తద్వారా తనను జట్టుకు ఎందుకు సారధిగా ఎంపిక చేశారో బలంగా చాటి చెప్పాడు. కేవలం బ్యాటింగ్ ద్వారానే కాకుండా.. మైదానంలో వ్యూహాలు రచించడంలోనూ గిల్ తనకు తానే సాటిని నిరూపించుకున్నాడు. ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం.. బౌలర్లకు ఒత్తిడి కలిగించకుండా రెస్ట్ ఇవ్వడం వంటి నిర్ణయాలు ఇండియా జట్టుకు సానుకూల ఫలితాన్ని అందించాయి. మొదటి టెస్టులో విజయానికి దగ్గరగా వచ్చినప్పటికీ.. బౌలింగ్ వైఫల్యం వల్ల భారత్ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ రెండో టెస్టులో అలా జరగలేదు. మరీ ముఖ్యంగా గిల్ బ్యాట్ నుంచి అసాధారణ ఇన్నింగ్స్ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లార్డ్స్ లో జరిగే టెస్టులో గిల్ కనుక ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే అనేక రికార్డులు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఆంగ్ల జట్టుతో జరుగుతున్న పోరులో ఇప్పటికే భారత జట్టు నాయకుడు రెండు మ్యాచ్లలో మూడు శతకాలు సాధించాడు. 146.25 సగటుతో 585 పరుగులు చేశాడు. బర్మింగ్ హంలో అతడు పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ.. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ తో ఆకట్టుకున్నాడు. తద్వారా ఈ మైదానంపై అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.. ఇదే కాక అతడు బద్దలు కొట్టగలిగే రికార్డులు అనేకం కనిపిస్తున్నాయి.
ఒక టెస్ట్ సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా బ్రాడ్ మన్ పేరు మీద రికార్డు ఉంది. 1936-37 కాలంలో ఇంగ్లీష్ జట్టుతో జరిగిన యాషష్ సిరీస్లో కంగారు జట్టు తరుపున బ్రాడ్ మన్ 810 రన్స్ చేశాడు. సగటున అతడు 90 పరుగులు చేశాడు. ఇందులో అతని పేరు మీద మూడు సెంచరీలు ఉన్నాయి. బ్రాడ్ మన్ రికార్డుకు గిల్ కేవలం 225 పరుగులు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే గిల్ ఆ రికార్డు బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
నాటి సిరీస్ లో కంగారు జట్టుకు బ్రాడ్ మన్ సారధ్య వహించాడు. బ్రాడ్ మన్ సారధిగా బాధ్యతలు స్వీకరించింది కూడా ఆ సిరీస్ లోనే కావడం విశేషం. ఇప్పుడు గిల్ కూడా సారధిగా తొలి టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ జట్టు పైన ఆడుతుండడం. నాటి సిరీస్ లో బ్రాడ్ మన్ వ్యక్తిగతంగా అతని అత్యధిక స్కోరు 270 పరుగులు. గిల్ ఇప్పటికి తన వ్యక్తిగత అత్యధిక స్కోర్ ను 269 పరుగులుగా నమోదు చేశాడు. 1930లో యాషెస్ సిరీస్లో బ్రాడ్ మన్ 974 పరుగులు చేశాడు. ఏ టెస్ట్ సిరీస్లో అయినా ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ పరుగుల రికార్డు బద్దలు కొట్టడానికి గిల్ కు ఇంకా 390 రన్స్ అవసరం.
నాటి యాషెస్ సిరీస్లో మొదటి రెండు టెస్టులలో బ్రాడ్ మన్ 394 పరుగులు చేశాడు. గిల్ మాత్రం ఏకంగా 585 రన్స్ చేశాడు. ఒకరకంగా చూసుకుంటే బ్రాడ్ మన్ కంటే గిల్ కు ఇప్పుడు హెడ్ స్టార్ట్ అడ్వాంటేజ్ ఉంది.
టెస్టులలో సారధిగాబ్రాడ్ మన్ వేగంగా 1000 పరుగులు చేశాడు. 11 ఇన్నింగ్స్లలో అతడు ఈ గంట సాధించాడు. గిల్ మరో 415 పరుగులు చేస్తే గిల్ బ్రాడ్ మన్ రికార్డు బద్దలు కొట్టగలడు.
1978-79 కాలంలో టీమిండియా సారథి సన్నీ 732 రన్స్ చేశాడు. వెస్టిండీస్ జట్టు మీద అతడు ఈ ఘనత సృష్టించాడు. గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టడానికి గిల్ కు ఇంకా 148 పరుగులు అవసరం..
సునీల్ గవాస్కర్ 1976లో న్యూజిలాండ్ జట్టుపై సెంచరీ చేయడం ద్వారా తన కెప్టెన్సీని విజయవంతంగా ప్రారంభించాడు. 14 ఇన్నింగ్స్ లలో వెయ్యి టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు.. ఆ కాలంలో అతడు ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 205 పరుగులు.గవాస్కర్ రికార్డ్ బద్దలు కొట్టడానికి గిల్ దగ్గరలో ఉన్నాడు.
1955లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో కరేబియన్ దిగ్గజం క్లయిడ్ వాల్కట్ ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఆ రికార్డును సృష్టించడానికి ఇంకా మూడు సెంచరీల దూరంలో ఉన్నాడు.
గిల్ మాదిరిగానే కరేబియన్ ఆటగాడు ఆ సిరీస్లో మొదటి రెండు టెస్టులలో మూడు సెంచరీలు సాధించాడు.. కింగ్ స్టన్ లో 108, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జంట శతకాలు సాధించాడు. ఆ తర్వాత కింగ్ స్టన్ లో జరిగిన ఐదో టెస్టులో వాల్కట్ మళ్లీ జంట సెంచరీలు సాధించాడు. మొత్తంగా తన శతకాల సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా జైస్వాల్ కొనసాగుతున్నాడు. గత ఏడాది ఐదు మ్యాచ్ల స్వదేశీ సిరీస్లో అతడేకంగా 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు 89. గిల్ ఆ రికార్డు బద్దలు కొట్టడానికి 127 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్నాడు. 2002లో అతడు మూడు సెంచరీల సహాయంతో 602 పరుగులు చేశాడు. ఆ రికార్డు బద్దలు కొట్టడానికి గిల్ 18 పరుగుల దూరంలో ఉన్నాడు
2016లో స్వదేశీ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుపై సారధిగా విరాట్ కోహ్లీ 655 పరుగులు చేశారు. సారధిగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టడానికి గిల్ ఇంకా 91 పరుగులు చేయాలి.