Trump Tariffs India: అగ్ర రాజ్యానికి రెండోసారి అధినేత అయిన తర్వాత ట్రంప్ వ్యవహారం కోతికి కొబ్బరి చిప్పలాగా మారిపోయింది.. ఆయన మాట్లాడుతున్న మాటలు.. ఇతర వ్యవహారాలు చాలావరకు వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ ట్రంప్ ఆగడం లేదు. పైగా నోబెల్ శాంతి బహుమతికి తనను నామినేట్ చేయాలని.. తనను శాంతి దూతగా ప్రకటించాలని చిత్రచిత్రమైన కోరికలు కోరుతున్నాడు. ఏదో ఒక మాధ్యమం లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ప్రపంచంలో ఏదో ఒక సంచలనం రేకెత్తించడం.. ఇటీవల కాలంలో అగ్రరాజ్య అధిపతి తన అలవాటుగా మార్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్న చాలామందిని యుద్ధ ఖైదీలుగా వారి వారి దేశాలకు పంపించాడు. ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ.. సొంత దేశంలో ప్రజలు యాక్ థూ అంటున్నప్పటికీ శ్వేత దేశ అధిపతి వ్యవహార శైలి మారడం లేదు.
ఇటీవల ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధించి అగ్రరాజ్య అధిపతి మరోసారి వార్తల్లో వ్యక్తయ్యాడు. ఈ సుంకాలను అతడు సమర్థించుకున్నాడు. పైగా అమెరికా ప్రపంచ దేశాల క్షేమాన్ని కోరుకుంటుందని రకరకాల వ్యాఖ్యలు చేశాడు. భారత్ మీద టారిఫ్ లు విధిస్తూ.. డెత్ ఎకానమీ అంటూ చెత్త వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో భారత్ తన వ్యాపార సౌలభ్యం కోసం ఇతర దేశాలతో మంతనాలు మొదలుపెట్టింది. అవి విజయవంతం కావడంతో అగ్రరాజ్యం విధించిన సుంకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడికి జ్ఞానోదయం కలిగినట్టు అయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ట్రంప్ రకరకాల వ్యాఖ్యలు చేశాడు. అందులో ప్రధానమైనది రష్యా , ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక రోజులోని ముగించడం. కానీ అది సాధ్యం కావడం లేదు. పైగా తాను ఆ హామీని నెరవేర్చలేక పోతున్నానని ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అంతేకాదు 7 నెలల కాలంలో ఏడు యుద్దాలను ఆపానంటూ డబ్బా కొట్టుకున్నాడు. 31 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక ఘర్షణకు ముగింపు పలికాను అని చెప్పుకున్నాడు. మాస్కో, కీవ్ యుద్ధాన్ని ముగించాలి అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదని ట్రంప్ వ్యాఖ్యానించాడు. మరవైపు భారతదేశంపై విధించిన సుంకాలను సమర్ధించుకున్న ట్రంప్.. ఇప్పుడు మరో విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. భారతదేశాన్ని దూరం చేసుకున్నామని.. భారత్ తో సంబంధాలు మెరుగవ్వాలని కోరుకుంటున్నట్టు.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. అమెరికా అధిపతి ఇలా మాట్లాడడం వింతగా లేకపోయినప్పటికీ.. తొలిసారి ట్రూత్ లో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అతడికి జ్ఞానోదయం అయినట్టు ఉందని ఇండియన్ నెటిజన్లు పేర్కొంటున్నారు.