Shreyas Iyer: అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మన స్థానంలో ఇంకొకరు వస్తారు. అది అతడికి కాస్త ఆలస్యంగా అర్థమైంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టులో స్థానం పోయింది.. చివరికి సెంట్రల్ కాంట్రాక్టు కూడా దూరమైంది. దీనికి తోడు తల పొగరు.. క్రమశిక్షణ లేదు అనే తిట్లను అతడు భరించాల్సి వచ్చింది. కానీ అతడిలో కసి పెరిగింది. చివరికి అతని పేరు మార్మోగిపోతుంది.
Also Read: టీ 20, CT వచ్చేశాయ్.. ఇంకా రెండు బాకీ ఉన్నాయి..అవి కూడా తెచ్చేయ్ రోహిత్..
టీమిండియాలో వర్ధమాన ఆటగాళ్లలో సూపర్ టాలెంట్ ఉన్న వాళ్లలో శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉంటాడు. అటాకింగ్ ఆట తీరుతోపాటు బ్రిలియంట్ ఫీల్డింగ్ చేస్తాడు. మైదానంలో అత్యంత చురుకుగా ఉంటాడు. ఒక్కోసారి శ్రేయస్ అయ్యర్ మైదానంలో కదిలే వేగాన్ని చూసి విరాట్ కోహ్లీ కూడా ఆశ్చర్యపోతుంటాడు. అలాంటి అయ్యర్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీం ఇండియా సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అలాంటి ఆటగాడు కొన్నిసార్లు లైన్ తప్పాడు. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. దీంతో అది అతడి ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక అప్పటినుంచి తనలో కసిని పెంచుకున్నాడు.. గోడకు కొట్టిన బంతిలాగా రెట్టింపు స్పీడ్ తో రావడం మొదలుపెట్టాడు . అలా ఇప్పుడు టీమిండియాలో కొత్త దేవుడైపోయాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన తర్వాత అయ్యర్ తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్ కతా జట్టుకు నాయకత్వం వహించిన అయ్యర్.. ఆ సీజన్లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిశాడు. ఇరానీ కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి.. టీమిండియాకు వెన్నెముకగా నిలిచాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో కోహ్లీ గాయపడిన నేపథ్యంలో జట్టులోకి వచ్చిన అయ్యర్.. ఇప్పుడు కీలక ఆటగాడిగా మారిపోయాడు. దీంతో బిసిసిఐ అతడికి సెంట్రల్ కాంట్రాక్టు మళ్ళీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
న్యూజిలాండ్ పై రెచ్చిపోయాడు
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు. వన్డే ఫార్మాట్లో జరిగిన ఈ ట్రోఫీలో అదరగొట్టాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుపై రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఫైనల్ లో అతడు చేసిన 48 పరుగులు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాయి. అతడు గనుక అక్షర పటేల్ తో 60 పరుగులకు మించి భాగస్వామ్యాన్ని నమోదు చేయకుండా ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇక న్యూజిలాండ్ జట్టుపై అయ్యర్ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ జట్టుపై వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 పరుగులు చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు తరఫున (243) పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ 15, 56, 79, 45, 48 పరుగులు చేశాడు.. సెమి ఫైనల్లో ఆస్ట్రేలియాపై, ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుపై అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ ఆ మ్యాచ్ లకే హైలెట్ గా నిలిచాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థిరమైన ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంటాడని తెలుస్తోంది.