Shreyas Iyer: అవకాశాల వెంట అతని పడలేదు. అవకాశాలు అతన్ని వెతుక్కుని వచ్చాయి. అలాగని అతడేమి తన క్రికెట్ ప్రయాణాన్ని కేక్ వాక్ లాగా మొదలుపెట్టలేదు. జట్టులో అవకాశం వచ్చినప్పుడు పొంగిపోలేదు. రానప్పుడు కృంగిపోలేదు. కలబడ్డాడు. పడిపోయినప్పుడు నిలబడ్డాడు.. ఎన్నడు కూడా ఓటమిని ఒప్పుకోలేదు. అలాగని గెలిచినప్పుడు పొంగిపోలేదు. భూమ్మీద మాత్రమే ఉన్నాడు. అదిగో ఆ డౌన్ టు ఎర్త్ విధానమే అతడిని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ లో లెజెండరీ ప్లేయర్ లు ఉన్నారు. 10 జట్లకు గొప్ప గొప్ప ప్లేయర్లు నాయకత్వం వహిస్తున్నారు. కానీ అందరికంటే ఎక్కువగా.. అందరికంటే మిన్నగా.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్పగా వినిపిస్తున్న పేరు శ్రేయస్ అయ్యర్.
అయ్యర్.. ఈ పదం మూడు అక్షరాలు మాత్రమే కాదు.. నాలుగు అక్షరాల నాయకత్వం కూడా. లేకపోతే ఎటువంటి ఆశలు లేని ఢిల్లీ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఆ గుండె ధైర్యానికి.. మానసిక దృఢత్వానికి ఏ స్థాయిలో సెల్యూట్ చేయాలి..కోల్ కతా అప్పుడెప్పుడో 2014లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2024 దాకా ఆ జట్టుకు ట్రోఫీ గెలిచిన దాఖలా లేదు. కాని దానిని చేసి చూపించాడు అయ్యర్.. 11 సంవత్సరాల క్రితం పంజాబ్ జట్టు ఐపీఎల్లో ఫైనల్ దాకా వెళ్ళింది. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. 11 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. గత ఏడాది జరిగిన ఫైనల్ లో పంజాబ్ ఓడిపోయినప్పటికీ.. ఇకపై ట్రోఫీ గెలుస్తామని నమ్మకాన్ని జట్టులో కల్పించాడు.
ప్రస్తుత ఐపీఎల్ లో పంజాబ్ జట్టు కు ఓటమి అనేది లేదు. ముంబై జట్టును సొంతవేదికలోనే పడుకోబెట్టింది. హైదరాబాద్ జట్టుకు వారి సొంత మైదానంలోనే చుక్కలు చూపించింది. చెన్నై జట్టుకు కూడా ఇదే పనిష్మెంట్ ఇచ్చింది. వర్షం వల్ల కోల్ కతా నైట్ రైడర్స్ బతికిపోయింది. లేకుంటే అయ్యర్ మాస్టర్ స్ట్రోక్ ముందు తలదించుకునేది.
అయ్యర్ లో దమ్ముంది. తెగువ ఉంది. పడిపోయినా సరే లేచే ధైర్యం ఉంది. అతడి ఆటిట్యూడ్ ప్రతి సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది. హార్దిక్ పాండ్యా క్యాచ్ అందుకున్న తర్వాత.. ముంబై మైదానం ఉన్న ప్రేక్షకులను పంజాబ్ కోసం సపోర్ట్ చేయాలని అతడు కోరిన విధానం ఇప్పట్లో ఎవరూ మర్చిపోరు.. ఎందుకంటే అయ్యర్ కు తెలుసు.. అభిమానులను ఏ విధంగా సమ్మోహన పరచాలో.. అందువల్లే ప్రీతి జింటా అతనిని పూర్తిగా నమ్మింది. అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అందువల్లే పంజాబ్ జట్టు గెలుస్తుంటే చూస్తోంది. ఒక ఆటగాడిగా పంజాబ్ జట్టును అయ్యర్ నిలబెట్టాడు. ప్రీతి జింటా నమ్మకాన్ని చూరగొన్నాడు. అయ్యర్ స్థాయిని బిసిసిఐ అంచనా వేయలేదు. ఒక దశలో సెంట్రల్ కాంట్రాక్టులో అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అయ్యర్ స్థాయిని చూసి బిసిసిఐ పెద్దలు తలదించుకుంటారు కావచ్చు. ఎందుకంటే అతడు ఇప్పుడు తల ఎగరేసి నిలబడ్డాడు.