Shreyas Iyer captaincy potential : ప్రపంచ క్రికెట్ మీద పెత్తనం సాగిస్తున్న బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ కాబట్టి.. ఆ రాజకీయాలకు అయ్యర్ బలవుతున్నాడు. ఉజ్వలంగా ఎదగాల్సిన చోట అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. వాస్తవానికి అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. అనితర సాధ్యమన్న సామర్థ్యాలు ఉన్న క్రీడాకారుడు. కానీ మేనేజ్మెంట్ లో ఉన్న రాజకీయాల వల్ల అతడు అనామక ఆటగాడిగా మారిపోతున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు అయ్యర్ ఎంతటి ముఖ్యపాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బలమైన జట్లపై ఎదురైన మ్యాచులలో కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టును గెలిపించాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తద్వారా జట్టులో బలమైన ముద్ర వేసుకున్నాడు. అయితే అలాంటి ఆటగాడు నాయకుడిగా జట్టును నడిపిస్తాడని అందరు అనుకుంటుంటే.. అతను మాత్రం చోటు దక్కకపోవడంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
Also Read : పటిష్టమైన ముంబై ఎందుకు ఓడిపోయింది.. ఆ తప్పులను అయ్యర్ సేన అనుకూలంగా మలచుకుందా?
ఇటీవల ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. జట్టుకు నాయకత్వం వహించే బాధ్యత అయ్యర్ కు లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడి స్థానంలో గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. చాలామంది క్రికెటర్లకు ఇది ఆశ్చర్యంగా అనిపించింది. అందరూ క్రికెటర్లు అయితే నేరుగానే తమ అభిప్రాయాన్ని చెప్పేశారు. మేనేజ్మెంట్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని.. దానివల్ల అయ్యర్ భవితవ్యం ప్రమాదంలో పడుతున్నదని మండిపడ్డారు. ” ఐపీఎల్ చరిత్రలో మూడు సీజన్లలో వేరువేరు జట్లను అద్భుతమైన స్థానంలోకి తీసుకెళ్లిన చరిత్ర అయ్యర్ కు ఉంది. ఢిల్లీ జట్టును ప్లే ఆఫ్ తీసుకెళ్లాడు. అప్పట్లో అదొక సంచలనం. గత ఏడాది షారుక్ ఖాన్ జట్టును ఫైనల్ తీసుకెళ్లి.. ఛాంపియన్ గా నిలిపాడు.. ఇక ఈ సీజన్లో పంజాబ్ జట్టును చివరిదాకా తీసుకెళ్లాడు. ట్రోఫీకి అడుగు దూరంలో ఉంచాడు. కన్నడ జట్టు తో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ” అయ్యర్ అద్భుతంగా ఆడతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు గొప్పగా నిలుస్తాడు. అటువంటి ఆటగాడు ఇలా ఉండిపోవడం బాధ కలిగిస్తోంది. కచ్చితంగా అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే జట్టుకు విజయాలు సాధ్యమవుతాయి. ట్రోఫీలు లభిస్తాయి. కానీ ఇటువంటి ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు దక్కకపోవడం నిజంగా దారుణమని” మాజీ క్రికెటర్లు వాపోతున్నారు. మరి ఇప్పటికైనా అయ్యర్ సామర్ధ్యాన్ని మేనేజ్మెంట్ గుర్తిస్తుందా? అవకాశాలు కల్పిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ అయ్యర్ ను కనుక నాయకుడిగా జట్టుకుని నియమిస్తే అప్పుడు ఫలితాలు వేరే విధంగా ఉంటాయని కొంతమంది సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని ఫార్మాట్లను అతడికి జట్టును నడిపించే బాధ్యతలు అప్పగిస్తే టీమిండియాకు తిరుగుండదని వారు స్పష్టం చేస్తున్నారు.