Shree Charani: ఆమె బంతి చేతిలో పట్టుకుంటే చాలు 360 డిగ్రీలు మెలికలు తిరుగుతుంది. పిచ్ తో సంబంధం లేకుండా వికెట్లను పడగొడుతుంది. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంది. అలాగని ఆమెకు సంవత్సరాలకు సంవత్సరాలు ఆడిన చరిత్ర లేదు. అంతర్జాతీయంగా సత్తా చూపించిన రికార్డు లేదు. కేవలం నైపుణ్యాన్ని మాత్రమే ఆమె నమ్ముకుంది. ఆ నమ్మకాన్ని చివరి వరకు కొనసాగించింది. అందువల్లే ఆమె ఇప్పుడు టీం ఇండియాలో స్థానాన్ని సంపాదించుకుంది. చివరికి తన స్థానానికి సార్ధకత చేకూర్చుకొని.. భవిష్యత్తు కాలానికి బంగారు బాటలు వేసుకుంది. ఇంత ఉపోద్ఘాతం మన తెలుగు బిడ్డ గురించి.. ఆమె సాధించిన ఘనత గురించి..
ఆ తెలుగు బిడ్డ పేరు శ్రీ చరణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా వీరపునాయిని మండలం లోని ఎర్రమల్లె ఆమె స్వగ్రామం. మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆమె.. ఏకంగా భారత జాతీయ జట్టుకు ఆడే స్థాయికి ఎదిగింది. ఎంతో పోటీ ఉన్నప్పటికీ.. అన్నింటిని అధిగమించి జట్టులో స్థానం సంపాదించుకుంది . ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని స్థిరం చేసుకుంది. తన ప్రదర్శన ద్వారా ఆకట్టుకుంది. బంతిని రకరకాలుగా తిప్పుతూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. దేశవాళీ టోర్నీలలో శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున అద్భుతంగా ఆడింది. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగితే.. ఢిల్లీ జట్టు తరఫున ఆడింది. ఢిల్లీ జట్టు ఆమెను 55 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో చరిణి కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడింది. అయితే ఆమె ప్రతిభ అద్భుతంగా ఉండడంతో సెలెక్టర్లు మార్చి నెలలో సీనియర్ మహిళ టోర్నీలో అవకాశం కల్పించారు. భారత బీ జట్టులో ఆడించారు. అక్కడ ఆమె తన ప్రతిభను చూపించడంతో.. జాతీయ జట్టు తరఫునుంచి పిలుపు వచ్చింది.
ఏప్రిల్ నెలలో శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో టీమ్ ఇండియాలోకి ప్రవేశించింది. మూడు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా వచ్చిన అవకాశాన్ని స్థిరం చేసుకుంది. అయితే ఆమెకు వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. వరల్డ్ కప్ లో ఆడేందుకు చాలామంది లైన్ లో ఉన్నప్పటికీ.. సెలక్టర్లు శ్రీ చరణి మీద ఫోకస్ పెట్టారు. ఎంట్రీ ఇచ్చిన నెలల వ్యవధిలోనే ఆమెను ప్రపంచకప్ కు ఎంపిక చేశారు.
సంవత్సరాలకు సంవత్సరాలు అనుభవం ఉన్న వారికి సైతం అవకాశం లభించకపోగా.. శ్రీ చరణికి మాత్రం త్వరగానే జాతీయ జట్టులోకి అవకాశం వచ్చింది.. వచ్చిన అవకాశాన్ని ఈ కడప అమ్మాయి సద్వినియోగం చేసుకుంది. తొమ్మిది మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ తర్వాత టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా శ్రీ చరణి అవతరించింది.
మావయ్య ప్రోత్సాహంతో శ్రీ చరణి క్రికెట్ లోకి ప్రవేశించింది. చిన్నప్పుడు తను బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్ వాటిల్లో ప్రతిభను చూపించేది.. 16 సంవత్సరాల వయసులో ఆమె క్రికెట్ పై మక్కువ పెంచుకుంది. కుటుంబ సభ్యులు మొదట్లో ప్రోత్సహించకపోయినప్పటికీ.. ఏడాది తర్వాత ఒప్పుకున్నారు. అయితే ఆమెను మొదటినుంచి కూడా మామయ్య కిషోర్ కుమార్ ప్రోత్సహించారు. చరణి మొదటినుంచి కూడా ఫాస్ట్ బౌలర్ గా ఉండేది.. అయితే అంతగా అందులో సఫలం కాకపోవడంతో స్పిన్ బౌలింగ్ వైపు వెళ్ళింది. అందులోవిజయవంతమైంది.. ఇప్పటివరకు ఆమె 18 వన్డేలు ఆడి.. 23 వికెట్లు పడగొట్టింది.