Telugu News » Sports » Should pant give up on world cup hopes decided icc
Rishabh Pant : వరల్డ్ కప్ ఆశలను పంత్ వదులుకోవాల్సిందేనా..! తేల్చిన ఐసీసీ
ప్రస్తుత పరిస్థితుల్లో రిషబ్ పంత్ ఫిట్నెస్ నిరూపించుకోవడం కష్టమని బీసీసీఐతోపాటు సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఆటగాడిపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను బీసీసీఐ వర్గాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ పంత్ కు ఉన్న మార్గాలు మూసుకుపోయినట్లు చెబుతున్నారు
Written By:
BS , Updated On : July 21, 2023 / 03:57 PM IST
Follow us on
Rishabh Pant : టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వరల్డ్ కప్ ఆశలు అడియాశలు అయినట్లు కనిపిస్తోంది. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో కొన్నాళ్లపాటు కోలుకున్న పంత్.. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించే పనిలో నిమగ్నమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ ఆడే జట్టులో సభ్యుడిగా ఉండాలన్న లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్న రిషబ్ కు ఆ దిశగా సానుకూల ఫలితాలు కనిపించడం లేదు. వరల్డ్ కప్ ఆడే జట్టులో రిషబ్ పంత్ పేరును ప్రకటించేందుకు అనుగుణమైన సమయం లేకపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది.
భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం భారత్ జోరుగా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఐసీసీ విడుదల చేసింది. క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్ లో 10 జట్లు పాల్గొననున్నాయి. భారత్ తరపున వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్న రిషబ్ పంత్ ప్రమాదం నుంచి కోలుకుని తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు. అయితే, రిషబ్ పంత్ వరల్డ్ కప్ లో ఆడే అవకాశం కనిపించడం లేదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచ కప్ ఆడే జట్లు తమ ఆటగాళ్ల వివరాలను ఖరారు చేయడానికి ఐసీసీ చివరి తేదీని ప్రకటించింది. వరల్డ్ కప్ ఆడే ఆయా దేశాలు తమ ఆటగాళ్లతో కూడిన జాబితాను ఆగస్టు 29 నుంచి ఐదో తేదీ మధ్య సమర్పించాల్సి ఉంటుందని ఐసిసి పేర్కొంది. ఇదే ప్రస్తుతం రిషబ్ పంత్ కు సమస్యగా మారిందని చెబుతున్నారు.
ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం..
రిషబ్ పంత్ వరల్డ్ కప్ లో ఆడాలంటే ముందుగా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిషబ్ పంత్ ఫిట్నెస్ నిరూపించుకోవడం కష్టమని బీసీసీఐతోపాటు సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఆటగాడిపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను బీసీసీఐ వర్గాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ పంత్ కు ఉన్న మార్గాలు మూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఆసియా కప్ సందర్భంగా రాహుల్ ఫిట్నెస్ ను నిశ్చితంగా పరిశీలించనున్నారు. ఆ తరవాత రాహుల్ ఎంత ఫిట్ గా ఉన్నాడని తేల్చుకుని వరల్డ్ కప్ లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీ లో కసరత్తులు ప్రారంభించాడు. ఉన్నత స్థాయి నుంచి రాహుల్ కు సమాచారం అందడం వల్లే అకాడమీలో చేరాడని, దీనివల్ల రిషబ్ పంత్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రిషబ్ పంత్ కు తీవ్ర నిరాశను కలిగించినట్లయిందని పలువురు పేర్కొంటున్నారు.