Australia Vs West Indies: జోసఫ్.. ఏం బంతి వేశావయ్యా.. వార్నర్ తోక ముడిచి వెళ్లిపోయాడు..

టి20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో.. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 256 రన్స్ చేసింది. మిగతా జట్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 9:11 am

Australia Vs West Indies

Follow us on

Australia Vs West Indies: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా ఓపెనర్ బరిలోకి దిగితే.. బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపించడు. ఫార్మాట్ ఎలాంటిదైనా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా ఫోర్లు.. జెర్సీ ధరించినంత వేగంగా సిక్సర్లు కొట్టేస్తాడు. చూస్తుండగానే పరుగుల సునామీ సృష్టించి.. అపారమైన నష్టాన్ని కలుగజేస్తాడు. అటువంటి ఈ దిగ్గజ ఆటగాడికి వెస్టిండీస్ బౌలర్ చుక్కలు చూపించాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వికెట్ తీసి అవతల పడేసాడు. దీంతో ప్రమాదకరమైన వార్నర్ తోక ముడిచి వెళ్లిపోయాడు.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో.. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 256 రన్స్ చేసింది. మిగతా జట్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాడు నికోలాస్ పూరన్ పూనకం వచ్చినట్టుగా బ్యాట్ తో చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 8 సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 75 పరుగులు చేశాడు. జాన్సన్ చార్లెస్ 40, రూథర్ ఫోర్డ్ 47 పరుగులు చేయడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.

257 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి, 222 పరుగులు చేసింది. 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వెస్టిండీస్ విధించిన 257 టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ముఖ్యంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ జోసెఫ్ బౌలింగ్లో తొలి 3 బంతుల్లో 14 పరుగులు పిండుకున్నాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ వరుసగా కొట్టాడు. దీంతో జోసెఫ్ తన లైన్ పూర్తిగా మార్చాడు. నాలుగో బంతిని బ్యాక్ అప్ లెంగ్త్ గా సంధించాడు. దీంతో ఆ బంతిని లాంగ్ సైట్ ఆడేందుకు వార్నర్ ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆ బంతి వేగంగా దూసుకొచ్చి, బ్యాట్ కు మిస్ అయింది. చూస్తుండగానే ఆఫ్ స్టంప్ ను పడగొట్టింది. దీంతో డేవిడ్ వార్నర్ తోక ముడిచి వెళ్లిపోయాడు.. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

జోసెఫ్ ఈ ఏడాది ఆస్ట్రేలియా తో గబ్బా మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను పేక మేడను తలపించాడు. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. టైటిల్ వేటలో తాము ముందు ఉన్నామని స్పష్టం చేసింది.