Commonwealth Games : భారత క్రీడా బృందానికి షాకింగ్ న్యూస్.. కామన్వెల్త్ గేమ్స్ లో ఆ క్రీడలు నిర్వహించరట!

హాకీ మన జాతీయ క్రీడ. ఈ క్రీడలో మన జాతీయ జట్టు ఆటగాళ్లు మళ్లీ పూర్వపు లయను అందుకుంటున్నారు. ఇక క్రికెట్ లో భారతీయ ఆటగాళ్ల ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాడ్మింటన్ లోనూ మన దేశ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తారు. అయితే ఈ క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ లో ఇక కనిపించవు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 22, 2024 6:45 pm

Commonwealth Games

Follow us on

Commonwealth Games : పెరుగుతున్న ఖర్చును తగ్గించుకోవడం కోసం 2026 లో గ్లాస్గో లో నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీని నిర్వహించరట. ఈ నిర్ణయం ఒక రకంగా భారతీయ క్రీడాకారులకు శరఘాతమే. ఎందుకంటే మనదేశ ఆటగాళ్లు పై క్రీడల్లో అద్భుతంగా సత్తా చాటుతారు. విశ్వ వేదికలపై మెడల్స్ సాధిస్తారు. అయితే ఈసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహక కమిటీ పై గేమ్స్ నిర్వహించబోమని స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, షూటింగ్, రోడ్డు రేసింగ్, నెట్ బాల్ వంటి క్రీడలను కూడా నిర్వహించబోమని కామన్ వెల్త్ క్రీడల సమాఖ్య వెల్లడించింది.. 2022లో బర్నింగ్ హమ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఆ సమయంలో అన్ని క్రీడలు నిర్వహించారు. మొత్తం 19 ఈవెంట్లలో క్రీడాకారులు తలపడ్డారు. అయితే ఈసారి క్రీడల ఖర్చు తగ్గించుకోవడం కోసం 9 క్రీడలను తొలగించాలని నిర్ణయించామని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య వెల్లడించింది. దీంతో ఈసారి కేవలం 10 క్రీడల్లోనే క్రీడాకారులు పోటీపడతారు.

భారత క్రీడాకారులకు షాక్

కామన్వెల్త్ క్రీడా సమాఖ్య తీసుకున్న నిర్ణయం భారత క్రీడాకారులకు షాక్ లాగా పరిణమించింది. ఎందుకంటే భారత క్రీడాకారులు హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్లో మెడల్స్ సాధిస్తారు. ఇటీవల నిర్వహించిన ఒలింపిక్స్ లోను భారత ఆటగాళ్లు హాకీ, షూటింగ్ లో మెడల్స్ సాధించారు. రెజ్లింగ్ లో మెడల్స్ రావాల్సి ఉన్నప్పటికీ.. వినేష్ ఫొగాట్ 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. ఇక 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 61 మెడల్స్ సాధించింది. ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే భారత సాధించిన మెడల్స్ లో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. ఇక రెజ్లింగ్ విభాగంలో అత్యధికంగా 12 మెడల్స్ వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ లో పది మెడల్స్ లభించాయి.. 2026 లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో నిర్వహించాల్సి ఉంది. అయితే ఖర్చులు పెరగడం వల్ల విక్టోరియా క్రీడలను నిర్వహించబోమని స్పష్టం చేసింది.. విద్య, వైద్యం మాత్రమే మాకు ముఖ్యమని.. క్రీడల కోసం ఆ స్థాయిలో ఖర్చు చేయలేమని స్పష్టం చేసింది. దీంతో ఆ టోర్నీ నిర్వహించేందుకు స్కాట్లాండ్ ముందుకు వచ్చింది.. ఈ క్రమంలో తొమ్మిది క్రీడలను తొలగించింది. తద్వారా పరిమిత బడ్జెట్లో క్రీడలను నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే స్కాట్లాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇటీవల ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ లోనూ భారీగా ఏర్పాట్లు చేశారని.. ఖర్చు కూడా విపరీతంగా పెట్టారని వార్తలు వచ్చాయి. క్రీడల నిర్వహణ కోసం ఏకంగా స్పోర్ట్స్ విలేజీ లు నిర్మించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.