Sarfaraz Khan On Fire: బంగారాన్ని అనేక ప్రక్రియలలో వేడి చేసి.. శుద్ధి చేస్తేనే మెరుస్తుంది. అలాగే ఒక ఆటగాడికి కూడా అనేక అవకాశాలు ఇస్తేనే అతడిలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. అయితే కొంతమంది ఆటగాళ్లకు టన్నుల కొద్ది ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాక.. మరుగున పడిపోతారు. అటువంటి వారిలో సర్ఫరాజ్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు . గత ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా ఇతడు టీమ్ ఇండియాలోకి ప్రవేశించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో విఫలమయ్యాడు. దానిని సాకుగా చూపి మేనేజ్మెంట్ ఇతడికి అవకాశాలు ఇవ్వడం మానేసింది.
మేనేజ్మెంట్ తనను పట్టించుకోకపోవడంతో.. ఎలాగైనా సరే తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవాలని సర్ఫ రాజ్ తహతహలాడుతున్నాడు. ఇందులో భాగంగానే డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడుతున్న సర్ఫ రాజ్ .. గోవా జట్టుతో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టెస్ట్ క్రికెటర్ అని తనమీద మేనేజ్మెంట్ వేసిన ముద్రను చెరిపి వేసే ప్రయత్నం చేశాడు.
గోవా జట్టుతో జరిగిన మ్యాచ్లో 75 బంతులు ఎదుర్కొన్న సర్ఫ రాజ్ 157 పరుగులు చేశాడు. ఇతడు ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇతడి సోదరుడు ముషీర్ ఖాన్ కూడా అదరగొట్టాడు. 66 బంతుల్లో 60 పరుగులు చేశాడు. గోవా జట్టులో ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ చెరి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నారు. తద్వారా ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది.
వచ్చిన అవకాశాన్ని సర్ఫ రాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అతడు అదే దూకుడు కొనసాగించాడు. ఏమాత్రం భయపడకుండా స్వేచ్ఛగా పరుగులు తీశాడు. ఒకవేళ అతడు గనుక ఓవర్లు పూర్తయ్య వరకు ఔట్ అవకుండా ఉండి ఉంటే ముంబై జట్టు 500కు మించి పరుగులు చేసి ఉండేది. అతడు ఈ స్థాయిలో బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా జట్టులో చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో అయ్యర్ ఆడేది అనుమానం కాబట్టి.. అతడి స్థానంలో సర్ఫ రాజ్ ను ఎంపిక చేస్తే బాగుంటుందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.