https://oktelugu.com/

Sanju  Samson Father : నా కొడుకు కెరియర్ నాశనం కావడానికి ఆ నలుగురే కారణం.. సంజు శాంసన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

టి20 క్రికెట్లో టీమిండియా తరఫున యువ ఆటగాడు సంజు సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2015లోనే అతను జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అతడి సామర్ధ్యం బయటి ప్రపంచానికి తెలియడానికి ఇంతకాలం పట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 13, 2024 8:54 am

Sanju  Samson Father

Follow us on

Sanju  Samson Father :  ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్లో అతడు సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో తొలి మ్యాచ్లో లోనూ శతకం బాదాడు. దీంతో అతడు మీడియాలో నానుతున్నాడు. దక్షిణాఫ్రికా తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో సెంచరీ చేసిన అతడు.. రెండో టి20లో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. సంజు అవుట్ కావడం టీమిండియా స్కోర్ పై తీవ్రంగా ప్రభావం చూపించింది. అతడు తొలి టీ20 మ్యాచ్లో సెంచరీ చేయడంతో.. టీమ్ ఇండియా స్కోర్ 200 పరుగులు దాటింది. అదే రెండవ మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా 130 పరుగుల లోపే ఇన్నింగ్స్ ముగించింది. అయితే రెండవ టి 20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇక ఈ క్రమంలో సంజు తండ్రి శాంసన్ విశ్వనాధ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజు కెరియర్ పట్ల సంచలన విషయాలు వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజుకు సంబంధించి శాంసన్ విశ్వనాథ్ ఓపెన్ అయ్యారు. ” ఒకప్పుడు సంజుకు టీమిండియాలో అవకాశాలు రాలేదు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు సంజుకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అదే ధోరణి కొనసాగించేవాడు. దీంతో నా కొడుకు 10 సంవత్సరాల కెరియర్ నాశనమైంది. నా కుమారుడి నైపుణ్యాన్ని గంభీర్ గుర్తించారు. సూర్య కుమార్ యాదవ్ కూడా పసిగట్టారు. వారు నా కొడుకుకి అవకాశాలు ఇచ్చారు. దాని ఫలితం ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. వరుసగా సెంచరీలు చేసి సంజు జోరు మీదున్నాడు. ఆ జోరు ఇంకా కొనసాగుతుంది. విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ నా కొడుకు కెరియర్ తో ఆడుకున్నారు. కనీసం అతడికి అవకాశాలు కూడా ఇవ్వలేదు. అయితే అలాంటి ఎదురు దెబ్బల నుంచి నా కుమారుడు రాటు తేలాడు. తనను తాను ఆవిష్కరించుకున్నాడని” శాంసన్ విశ్వనాథ్ వ్యాఖ్యానించాడు.

మాటలతో బాధపెట్టారు

సంజు విషయంలో రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని మాత్రమే కాదు తమిళనాడు మాజీ క్రికెటర్ కూడా క్రిష్ శ్రీకాంత్ దారుణంగా మాట్లాడాడని శాంసన్ విశ్వనాథ్ వ్యాఖ్యానించాడు..” క్రిష్ శ్రీకాంత్ నా కుమారుడు గురించి అనుచితంగా మాట్లాడాడు. అతడు ఎలాంటి ఆట ఆడాడో నాకు తెలియదు. ఎప్పుడు ఆడాడో నాకు గుర్తుకులేదు. సంజు గురించి అతడు ఒక మంచి మాట కూడా చెప్పగా నేను వినలేదు. నా కుమారుడిని బాధ పెట్టిన వారిలో అతడు కూడా ఉన్నాడు. బంగ్లాదేశ్ పై నా కుమారుడు సెంచరీ చేస్తే దానిని అతడు ఎగతాళి చేశాడు. సెంచరీ అనే దానిని సెంచరీ లాగానే చూడాలి. బంగ్లాదేశ్ పై సెంచరీ చేస్తే అది ఎగతాళికి అర్హం అవుతుందా? సచిన్, ద్రావిడ్ లాగా సంజు ఆడతాడు. అతడికి క్లాసిక్ బ్యాటింగ్ వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి ఆటగాళ్ళను ప్రోత్సహించకుంటే జట్టు ఎలా బాగుపడుతుంది? ఇన్ని సంవత్సరాల కైనా సంజుకు అవకాశాలు వస్తున్నాయి.. ఈ అవకాశాలు కల్పించిన గంభీర్, సూర్యకు ధన్యవాదాలు. ఒకవేళ వీరిద్దరూ కనుక లేకుంటే నా కుమారుడికి అవకాశాలు వచ్చేవి కాదు. సంజు దక్షిణాఫ్రికాపై సాధించిన సెంచరీని వారిద్దరికీ అంకితం ఇవ్వాలని భావిస్తున్నాను. ఇన్ని రోజులపాటు అవకాశాలు రాకపోవడంతో సంజు ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు అతడి స్థానం జట్టులో సుస్థిరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై కొత్త సంజును చూస్తారు. అతని ఆటను అభిమానులు ఆస్వాదిస్తారు.. స్వార్థం కోసం జట్టులో ఆడాలని నా కుమారుడికి లేదు. జట్టులో చోటు కోసం మాత్రమే ఆడాలనే తాపత్రయం కూడా లేదు. అతడు అద్భుతమైన క్రికెటర్. ఆ విషయంలో ఒక తండ్రిగా గర్వపడుతున్నానని” శాంసన్ విశ్వనాధ్ వ్యాఖ్యానించారు.