Sanju Samson: వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే.. సింహభాగం లభిస్తుందని తెలుగులో ఓ నానుడి ఉంది.. ఆ నానుడి టీమిండియాలో గిల్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. పదేపదే అదే బంతులకు అవుట్ అవుతున్నప్పటికీ మేనేజ్మెంట్ అతని మీద ప్రేమ కనబరుస్తోంది. కానీ ఇదే సమయంలో అతని కంటే గొప్పగా ఆడే ప్లేయర్లను మాత్రం తుది జట్టుకు దూరం పెడుతోంది.
టీమిండియా ఇటీవల కాలంలో ఆడిన టి20 సిరీస్లలో ఒక్కదానిని కూడా కోల్పోలేదు.. ముఖ్యంగా దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో జట్టులో ప్రవేశించిన కేరళ వాసి సంజు శాంసన్ సెంచరీల మోత మోగించాడు.. తద్వారా తనలో ఫైర్ అలాగే ఉందని నిరూపించాడు.. దీంతో మేనేజ్మెంట్ అతడిని ఆస్ట్రేలియా జట్టుతో జరిగే టి20 సిరీస్ కు ఎంపిక చేసింది.. ఈ సిరీస్ లో సంజు కు రెండవ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రమే లభించింది. ఆ మ్యాచ్లో అతడు విఫలమయ్యాడు.. దీంతో మేనేజ్మెంట్ మరో మాటకు తావు లేకుండా అతడిని పక్కన పెట్టింది. మూడో మ్యాచ్ కు అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది.. నాలుగో మ్యాచ్ లో కూడా అతనికి అదే పరిస్థితి ఎదురుగానుంది. కానీ అతడి మాదిరిగానే విఫలమవుతున్న గిల్ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ విపరీతమైన ప్రేమ కనబరుస్తోంది.. అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికీ అవకాశాల మీద అవకాశాలు ఇస్తోంది.. గడచిన ఆరు ఇన్నింగ్స్లలో తనదైన శైలిలో బ్యాటింగ్ చేయలేదు. జట్టుకు ఉపయోగపడే ఒక్క ఇన్నింగ్స్ కూడా అతడు ఆడలేదు.
గిల్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతనికి అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పోనీ అతడేమైనా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే అది కూడా లేదు. ఫ్లైటేడ్ బంతులను అతడు ఎదుర్కోలేకపోతున్నాడు.. ఆ బంతులకే అవుట్ అవుతూ నిరాశ పరుస్తున్నాడు.. ఓపెనర్ గా వచ్చిన అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయకుండా.. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. మరోవైపు అతని స్నేహితుడు అభిషేక్ శర్మ మాత్రం తుఫాన్ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు.. సునామి లెవెల్ లో పరుగుల వరద పారిస్తున్నాడు.. ఈ స్థాయిలో విఫలమవుతున్నప్పటికీ గిల్ కు అవకాశాలు ఇస్తున్న మేనేజ్మెంట్.. సంజు విషయంలో ఎందుకంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందో అర్థం కావడంలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. మరోవైపు సంజు కెరియర్ గురించి అతని తండ్రి గతంలోనే సంచలన ఆరోపణలు చేశాడు.. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ తన కొడుకుకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని.. అతని కెరియర్ తో ఆడుకున్నాడని ఆరోపించాడు. ఇప్పుడు తుది జట్టులో సంజు కు అవకాశాలు లభించకపోవడం పట్ల.. అతడు ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.