Rohit Sharma: వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి మెగా వేలం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ మెగా వేలంలో ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొని అవకాశం ఉంది. ఈ సీజన్లో ముంబై జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా వ్యవహరించాడు. ముంబై జట్టు యాజమాన్యం రోహిత్ కు మాటమాత్రమైనా చెప్పకుండా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. దీంతో హిట్ మాన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో అడాల్సి వచ్చింది. అయితే ఆ సీజన్లో ముంబై జట్టు అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేసింది. అనామకంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతలనుంచి తొలగించిన తర్వాత రోహిత్ శర్మ ముభావంగా ఉన్నాడు. ఇదే సమయంలో వచ్చే సీజన్లో అతడు కచ్చితంగా వేలంలోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే రోహిత్ సంకేతాలు ఇస్తున్నాడు. రోహిత్ ఒకవేళ వేళల్లోకి వస్తే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్లు అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇదే సమయంలో మరో వార్త కూడా సోషల్ మీడియాలో ఆసక్తిని కలగజేస్తోంది.. ఒకవేళ మెగా వేలంలో రోహిత్ శర్మ తన పేరును నమోదు చేసుకుంటే.. అతడు ఏ జట్టులోకి వెళ్తాడనే ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. దీనిపై పంజాబ్ జట్టు డైరెక్టర్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు..” రోహిత్ చాలా విలువైన ఆటగాడు.. అతడు వేలంలోకి వస్తే కొత్త రికార్డులు నమోదవుతాయి. గత సీజన్లో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆవిర్భవించాడు. 24.75 కోట్లు ఖర్చు చేసి కోల్ కతా జట్టు స్టార్క్ ను కొనుగోలు చేసింది. ఒకవేళ రోహిత్ 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి వేలంలోకి వస్తే అతడిని సొంతం చేసుకునేందుకు అన్ని జట్లు ముందుకు వస్తాయి.. అయితే మా దగ్గర డబ్బు ఎంత ఉంది? దానిని బట్టి అతడిని మేము కొనుగోలు చేయగలమా? లేదా? అనే విషయం ఆలోచించుకుంటాం. ఎందుకంటే ఒక ఖరీదైన ఆటగాడిని కొనుగోలు చేయాలంటే డబ్బులు కూడా భారీగానే ఉండాలి. అంత డబ్బులు సర్దుబాటు కూడా చేయగలగాలి. పేరుపొందిన ఆటగాడిని సొంతం చేసుకోవడం అంటే అంత సులభం కాదు. మా అడుగులు రోహిత్ వైపు ఉన్నప్పటికీ.. అతడికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఉండాలి కదా అంటూ” బంగర్ వ్యాఖ్యలు చేశాడు.
ఒకవేళ రోహిత్ కనుక వేలంలోకి వస్తే అతడికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. రోహిత్ అత్యంత సులభంగా బ్యాటింగ్ చేస్తాడని, పైగా ముంబై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడని, అందువల్లే అతడిని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు పోటీలు పడతాయని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. సమకాలీన క్రికెట్లో రోహిత్ అద్భుతమైన బ్యాటర్ అని వారు కొనియాడుతున్నారు.