https://oktelugu.com/

National Best Teachers: మన టీచర్లు ఉత్తములు.. జాతీయ అవార్డులకు ఇద్దరు ఎంపిక..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాబోధనలో ప్రత్యేకత చాటుకునే ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు ఇస్తున్నాయి. ఈ ఏడాది కూడా అవార్డులు కేంద్రం ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఇద్దరు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 28, 2024 / 03:19 PM IST

    National Best Teachers

    Follow us on

    National Best Teachers: భారత రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుంచి∙1952 వరకు సోవియట్‌ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుంచి 1948 వరకు బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్‌–ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్‌–ఛాన్సలర్‌గా కూడా ఉన్నాడు. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశాడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి తర్వాత రాష్ట్రపతి వరకు ఎదిగారు. దీంతో ఆయన జ్ఞాపకార్థం కేంద్రం ఆయన జయంతి రోజు అయిన సెప్టెంబర్‌ 5న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు. ఖమ్మం రూరల్‌ మండలం తిరుమలాయపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న పెసర్ల ప్రభాకర్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న తందూరి సంపత్‌కుమార్‌ ఈ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు.

    50 మంది ఎంపిక..
    దేశ వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం కేంద్రం 50 మందిని ఎంపిక చేసింది. ఇందులో ఇద్దరు తెలంగాణ వాసులు ఉండడం గమనార్హం. ఏపీ నుంచి కృష్ణా జిల్లా గుడివాడలోని ఎస్పీఎస్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ప్లస్‌ ఉపాధ్యాయుడు మిద్దె శ్రీని వాసరావు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఉరందూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడు సురేశ్‌ కునాటి ఈ పురస్కారాలు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అను జైన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీలోని నిర్వహించే కార్యక్రమంలో వీరికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవారులో భాగంగా రూ. 50 వేలు, మెరిట్‌ సర్టిఫికెట్, సిల్వర్‌ మెడల్‌ను అందించనున్నారు.

    సంపత్‌కుమార్‌ ప్రస్థానం ఇదీ..
    పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేట గ్రామానికి చెందిన సంపత్‌కుమార్‌ 2001లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. జనవరి 2022లో బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలకు వచ్చారు. తన ఉపాధ్యాయ వృత్తి ముగి సేలోగా 100 మంది గ్రామీణ విద్యార్థులను ఇన్నోవేటర్‌లుగా మార్చాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 53 మందిని ఇన్నోవేటర్లుగా మార్చారు. పెద్దపల్లి జిల్లా చందనాపూర్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అనేక సైన్స్‌ ప్రదర్శనలకు గైడ్‌ టీచర్‌గా వ్యవహరించి విద్యా ర్థులు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందుకోవడంలో కృషి చేశారు.

    ఏజెన్సీ నుంచి జాతీయ స్థాయికి..
    ఏజెన్సీ ప్రాంతమైన మహబూబాబాద్‌ జిల్లా (పూర్వ ఖమ్మం జిల్లా) బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి 1996లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 28 ఏళ్లపాటు ఏజెన్సీ ప్రాంతాలైన గుండాల, గార్ల, బయ్యారం, అశ్వాపురం, కామేపల్లి పాఠశాలల్లోనే ఆయన విధులు నిర్వర్తించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా విద్యాబోధన చేపట్టేందుకు బోధనోపకరణాలు రూపాందించేలా 2014లో స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌గా చేరారు. ఎస్సీఈఆర్‌టీకి నాలుగు పుస్తకాలను రాయడంతోపాటు ఓపెన్‌ విద్యావిధా నంలో పదో తరగతికి నాలుగు పాఠ్యపుస్తకాల తయారీలోనూ పాలుపంచుకున్నారు.