Saeed Ajmal Comments on Pakistan Cricket: ప్రపంచంలో చాలా దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్లేయర్లకు మెరుగైన ప్రయోజనాలు కలిపిస్తున్నాయి. అంతేకాదు ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలు గెలిచినప్పుడు భారీగానే నజరానా ఇస్తున్నాయి. ఇలా భారీగా నజరానా ఇవ్వడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని.. మెరుగ్గా ఆడతారని మేనేజ్మెంట్లు భావించడమే ఇందుకు కారణం. ఈ జాబితాలో మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తి విభిన్నం.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చాలామంది పెత్తనం ఉంటుంది. పేరుకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. కిందిస్థాయి వ్యక్తులు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అందువల్లే ఆ జట్టుకు కోచ్ లు స్థిరంగా ఉండరు. గడిచిన కొద్ది కాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో దాదాపు నలుగురు కోచ్ లు మారారు. వారంతా కూడా మేనేజ్మెంట్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ లు మారుతూ ఉండడం, సారధులను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండడంతో పాకిస్తాన్ క్రికెట్ కు ఒక గతి అంటూ లేకుండా పోయింది.
పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు వివాదాస్పదంగా, ఇంకొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉంటాయి. అలాంటి విషయమే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషయం చెప్పింది బయట వ్యక్తులు కాదు.. ఇతర దేశాల మీడియా అంతకన్నా కాదు. సాక్షాత్తు పాకిస్తాన్ జట్టులో ఆడిన మాజీ ఆటగాడే ఈ విషయాలను బయటపెట్టాడు.
అతని పేరు సయ్యద్ అజ్మల్. 2009లో పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతడు ఆ జట్టులో కీలక ఆటగాడు. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క ఆటగాడికి 25 లక్షలు ఇస్తామని చెప్పింది. దానికి తగ్గట్టుగానే చెక్కులు కూడా ఇచ్చింది. దీంతో ఎంతో ఆశతో పాకిస్తాన్ ప్లేయర్లు ఆ చెక్కులను బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి. ఇంతవరకు ఆటగాళ్లకు ఒక్క రూపాయి కూడా పాకిస్తాన్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు. దీనిపై అనేకసార్లు మేనేజ్మెంట్ ను కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని అజ్మల్ వాపోయాడు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram