SA w Vs Ban w World Cup 2025: మళ్లీ అదే ఫలితం.. మళ్లీ అదే సంఘటన.. మళ్లీ అదే పునరావృతం. మ్యాచ్ మారింది.. వేదిక మారింది. ప్రత్యర్థి కూడా మారింది. కానీ ఆమె ఆటతీరు మారలేదు. ఆమె పోరాట పటిమ ఏమాత్రం తగ్గలేదు. తగ్గాల్సిన చోట తగ్గింది. నెగ్గాల్సిన చోట నెగ్గింది. చివరికి తనకు తానే సాటి అని నిరూపించుకుంది.
ఇటీవల టీమిండియాతో సౌత్ ఆఫ్రికా తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 250 పరుగుల టార్గెట్ సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది. భారత బౌలర్లు వేగంగానే వికెట్లు తీశారు. కానీ ఎప్పుడైతే డి క్లెర్క్ మైదానంలోకి వచ్చిందో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. చూస్తుండగానే చాప కింద నీరు లాగా దూసుకుపోయింది. మొదట్లో నిదానంగా.. తర్వాత వేగంగా పరుగులు తీసింది. తద్వారా లక్ష్యాన్ని క్రమంగా కరిగించి టీమిండియా కు ఓటమిని పరిచయం చేసింది. తద్వారా వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని నమోదు చేసింది.. అంతకుముందు జరిగిన మ్యాచ్లో 69 పరుగులకే ఆల్ అవుట్ అయిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత వెంటనే తేరుకుంది. కివీస్ జట్టుపై విజయం, ఆ తర్వాత టీం ఇండియాపై గెలుపు సాధించి అద్భుతాలు సృష్టించింది.
ఇండియా మీద గెలవడం యాదృచ్ఛికం కాదని.. నిరూపించింది సౌతాఫ్రికా. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో చివరి వరకు పోరాడి విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. బంగ్లాదేశ్ విధించిన 233 పరుగుల టార్గెట్ ను మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది సౌత్ ఆఫ్రికా. డి క్లెర్క్ టీ మీడియా పై చేసినట్టుగానే.. బంగ్లాదేశ్ పై కూడా బ్యాటింగ్ చేసింది. వాస్తవానికి టార్గెట్ ఫినిష్ చేయడంలో సౌత్ ఆఫ్రికా ప్రారంభంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. 78 పరుగులపై ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కాప్ 56, ట్రయాన్ 62 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. చివర్లో డి క్లెర్క్ 37* పరుగులు చేసి ఆదరగొట్టింది. చివరి వరకు నిలబడి బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఇండియాలో జరిగిన మ్యాచ్ లోనూ డి క్లెర్క్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటింది.
డి క్లెర్క్ చివర్లో స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో బంగ్లాదేశ్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. తమ హార్ట్ బ్రేక్ అయిందని బంగ్లాదేశ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డి క్లెర్క్ ను ఔట్ చేయడంలో తమ ప్లేయర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని.. అందువల్లే తమకు ఈ ఓటమి ఎదురైందని వాపోతున్నారు. ఇకనైనా బంగ్లా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాలని వారు సోషల్ మీడియాలో కోరుతున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచేలా కనిపించింది.. కానీ డి క్లెర్క్ వారి ఆశల మీద నీళ్లు కుమ్మరించింది.