Sachin Tendulkar: సచిన్‌సార్‌.. నిజంగా మీరు దేవుడు!

సామాజిక సేవా కార్యక్రమాల కోసం సచిన్‌ తన పేరిటే సచిన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో కిరన వారికి కాదనకుండా సాయం చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 3:56 pm
Follow us on

Sachin Tendulkar: సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కరలేని పేరు. భారత క్రికెట్‌లో ఆయన సాధించిన రికార్డులకు కొదువ లేదు. అంతకు మించి ఆయన క్రమశిక్షణ, ఆటపట్ల అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. అందుకే యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆయనను గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులు సృష్టించిన సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్‌ అయ్యాక కూడా తనవంతుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సచిన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు..
సామాజిక సేవా కార్యక్రమాల కోసం సచిన్‌ తన పేరిటే సచిన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో కిరన వారికి కాదనకుండా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్మించారు. ఇందులో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని నిర్ణయించారు. ఈ పాఠశాలను మధ్యప్రదేశ్‌లోని సందల్‌పూర్‌లో నిర్మిస్తున్నారు. పాఠశాల ద్వారా రాబోయే దశాబ్దంలో 2,300 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని సచిన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

పిల్లల పెదాలపై చిరునవ్వు కోసం..
ఇక మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు మాస్టర్‌ బ్లాస్టర్‌. దేశంలో ఏటా 60 వేల మంది చిన్నారులు పెదవి చీలిక(గ్రహణం మొర్రి)తో పుడుతున్నారు. అలాంటి పిల్లలను గుర్తించి వారి మోములో చిరునవ్వు చూడాలనుకుంటున్నారు. వారి పెదవులపై నవ్వులు పూయించాలని సంకల్పించారు. ఈ క్రమంలో సచిన్‌ ఫౌండేషన్‌ ద్వారా పెదవి చీలిక ఉన్న పిల్లలకు ఆపరేషన్‌ చేయిస్తున్నారు. ఇప్పటికే అనేక మందికి ఆసరేషన్‌ పూర్తయింది. శస్త్ర చికిత్సకు ముందు.. తర్వాత వీడియోను సచిన్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కశ్మీర్‌ పర్యటనలో భాగంగా తము శ్రీనగర్‌ కేంద్రాన్ని సందర్శించామని వెల్లడించారు.

సచిన్‌ సంకల్పాని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిన్నారుల పెదవులపై చిరునవ్వులు పూయించడం చాలా గొప్ప విషయంగా పలువురు కామెంట్లు పెడుతున్నారు.