Sachin Tendulkar leaves Mumbai: క్రికెట్లో ఒకప్పుడు బ్రాడ్మన్ గొప్ప వ్యక్తిగా ఉండేవారు. అద్భుతమైన ఆటగాడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అనేక రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో బ్రాడ్మన్ స్థాయిలో ఎవరూ రికార్డులు సాధించలేరని అందరూ ఒక అంచనాకొచ్చారు. అదిగో అప్పుడు ఒక ధ్రువతార లాగా టీమిండియాలోకి వచ్చాడు సచిన్ టెండూల్కర్. చిన్న వయసులో టీమిండియాలోకి ప్రవేశించిన అతడు అనితర సాధ్యమైన రికార్డులను నెలకొల్పాడు.
టెస్ట్, వన్డే, ఐపీఎల్.. ఇలా అన్ని ఫార్మాట్లలో అదరగొట్టాడు. లిటిల్ మాస్టర్ నుంచి మాస్టర్ బ్లాస్టర్ లాగా ఎదిగిన అతడు.. చివరికి క్రికెట్ గాడ్ గా ఆవిర్భవించాడు.. సచిన్ 2011లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పేశాడు. కొంతకాలం ఐపీఎల్లో ఆడినప్పటికీ.. ఆ తర్వాత ఆ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఆమధ్య పెద్దల సభకు ఎంపిక అయ్యాడు. ఇప్పుడు సచిన్ సామాజిక సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటున్నాడు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించే కార్యక్రమాలలో అతడు తన వంతు పాత్రను నిర్వర్తిస్తున్నాడు.
మధ్యలో కొన్ని సందర్భాలలో ఐసీసీ ఆధ్వర్యంలో క్రికెట్ విస్తరణకు.. క్రికెట్ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించాడు. వర్ధమాన దేశాలలో క్రికెట్ విస్తరణకు తన వంతుగా ఆ ప్రాంతాలలో పర్యటించాడు. అప్పట్లో సచిన్ వర్ధమాన క్రికెటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. క్రికెట్ ను గొప్పగా ఎలా ఆడాలి.. ఇందులో ప్రావీణ్యం ఎలా సంపాదించాలి.. ఇలా ఆడితే గొప్ప ప్లేయర్లు అవుతారు అనే విషయాలపై.. సోదాహరణంగా వివరించారు సచిన్.
సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనే సచిన్.. ఇప్పుడు ఉన్నట్టుండి ముంబైని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అలాగని శాశ్వతంగా కాదు.. సచిన్ ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ దంతేవాడ జిల్లాలో టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశీ ఫౌండేషన్, చత్తీస్గడ్ ప్రభుత్వం చేపట్టిన మైదాన్ కప్ లో పాల్గొన్నారు. ఆదివాసీ యువత తుపాకుల వైపు వెళ్లకుండా.. వామపక్ష ఉద్యమాలవైపు ఆకర్షితులు కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 2020లో దివ్యాంగబలుడు మద్దారామ్ నేలపై పాకుతూ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోను చూసిన సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత అతని క్రికెట్ ఆడాలని సూచించాడు. స్వయంగా క్రికెట్ కిట్ పంపించాడు. ఆ బాలుడితో సచిన్ స్వయంగా క్రికెట్ ఆడాడు. అంతేకాదు స్థానికుల తో చాలాసేపు ముచ్చటించారు. వారి యోగ క్షేమాలను సచిన్ కనుక్కున్నారు.