RR Vs LSG IPL 2025: ఈ మాచ్ ద్వారా రాజస్థాన్ జట్టులోకి 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ పక్కటెముకల గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో.. లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అతడు దూరమయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్స్ పూర్తిస్థాయిలో ఆడింది. 180 పరుగులు చేసింది. మార్క్ రం 66, ఆయుష్ బదోని 50 పరుగులతో ఆకట్టుకున్నారు. హసరంగ రెండు వికెట్లు సాధించాడు. ఇక 181 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. ప్రారంభం నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా రాజస్థాన్ జట్టు ఆటగాడు వైభవ్ సూర్య వంశీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతిని లాగిపెట్టి కొట్టి.. ఎక్కడో స్టాండ్స్ అవతల పడేశాడు. దీంతో మైదానం మొత్తం కేరింతలు.. అరుపులు.. కేకలు.. ఈలలు.. గోలలు.. మూతి మీద మీసం కూడా రాకముందే.. కనీసం హై స్కూల్ చదువు కూడా పూర్తి చేయకముందే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో ఆడుతుండడం విశేషం.
30 లక్షల బేస్ ప్రైస్..1.1 కోట్లు
వైభవ్ సూర్యవంశీ గత ఐపీఎల్ మెగా వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్ తో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతని కోసం లక్నో, రాజస్థాన్ జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. చివరికి ఉత్కంఠ మధ్య 1.1 కోట్ల ధరను వైభవ్ సూర్యవంశీ పలికాడు. సూర్యవంశీని చివరకు రాజస్థాన్ రాయల్స్ అత్యంత పోటీ మధ్య తన జట్టులో సభ్యుడిగా చేసుకుంది. ఇక నాటి నుంచి నేటి వరకు వైభవ్ సూర్యవంశీకి ఆడే అవకాశం రాలేదు. అయితే అతడు నెట్స్ లో సాధన చేస్తున్న తీరు చూసి కోచ్ రాహుల్ ద్రావిడ్ ముచ్చటపడ్డాడు. సంజు శాంసన్ గాయపడిన నేపథ్యంలో.. అతని స్థానంలో తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే కోచ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వైభవ్ సూర్యవంశీ వమ్ము చేయలేదు. అంతేకాదు శార్దూల్ ఠాకూర్ లాంటి బౌలర్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి తన సత్తా ఏమిటో చూపించాడు. అతడు సిక్స్ కొట్టగానే మైదానం మొత్తం షేక్ అయింది. ఐపీఎల్ చరిత్రలో తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ.