RCB Vs RR 2024: ఈ సాలా కప్ నమదే అంటూ బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ లో రాజస్థాన్ చేతిలో భంగపాటు ఎదురయింది. ఎన్నో ఆశలతో.. సెకండ్ స్పెల్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న బెంగళూరు ప్లే ఆఫ్ లో రాజస్థాన్ జట్టు చేతుల్లో ఓడిపోయింది.. దీంతో ఈసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోవాలనే కల కల్లలయింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు.. అనుకున్నట్టుగానే బెంగళూరును కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో.. 8 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. లక్ష్యం మరీ అంత పెద్దది కాకపోవడం.. మైదానం బ్యాటింగ్ కు అనుకూలించడంతో.. రాజస్థాన్ సునాయాసంగానే లక్ష్యాన్ని చేదించింది..
173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. యశస్వి జైస్వాల్ 46, రియాన్ పరాగ్ 36, హిట్మేయర్ 26, కాడ్మోర్ 20 పరుగులు చేయడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. దీంతో బెంగళూరు ఓటమిపాలైంది. ఈసారి కూడా ఐపీఎల్ కప్ కల సాకారం కాకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన బాగోలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలోనే బెంగళూరు అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది.
రాజస్థాన్ చేతిలో ఓటమి ద్వారా బెంగళూరు ప్లే ఆఫ్ లో అత్యధిక సార్లు వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. బెంగళూరు ఇప్పటివరకు 16 మ్యాచ్లలో.. పదిసార్లు ప్లే ఆఫ్ వెళ్ళింది. అన్నిసార్లు ఓడిపోయి.. కప్ వేట విజయవంతం కాకుండానే వెనుతిరిగిన జట్టుగా అప్రతిష్టను మూటకట్టుకుంది. బెంగళూరు తర్వాత స్థానంలో చెన్నై జట్టు ఉంది. చెన్నై జట్టు 26 మ్యాచ్లలో 9 సార్లు ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లలో 9 ఓటములు మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్లలో ఏడుసార్లు ఓడిపోయింది. హైదరాబాద్ 12 మ్యాచ్లలో 7 సార్లు పరాజయం పాలయ్యింది. అయితే బెంగళూరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు.