IPL 2024 – RCB : అది గుజరాత్ లోని అహ్మదాబాద్.. నరేంద్ర మోడీ స్టేడియం.. ఐపీఎల్ 17వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్.. రాజస్థాన్, బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్లు డూ ప్లెసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 4.4 ఓవర్లలోనే 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధాటిగా ఆడే క్రమంలో డూ ప్లెసిస్ 17 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 33 పరుగులు చేసి యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఈ దశలో గ్రీన్ 27, రజత్ 34 జట్టు ఇన్నింగ్స్ భారం భుజాలకు ఎత్తుకున్నప్పటికీ.. కీలక దశలో పెవిలియన్ చేరుకున్నాడు. జట్టు స్కోర్ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు గ్రీన్ అవుట్ అయ్యాడు.
గ్రీన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి మాక్స్ వెల్ వచ్చాడు. వాస్తవానికి ఈ టోర్నీలో మాక్స్ వెల్ పెద్దగా ఫామ్ లో లేడు.. పైగా దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్ లోనైనా బాగా ఆడతాడని తీసుకుంటే.. జట్టు ఆశలను నిండా ముంచాడు.. పైగా రవిచంద్రన్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ధృవ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో మాక్స్ వెల్ పై అభిమానులు మండిపడుతున్నారు.. 17 కోట్లు పెట్టుకుంటే సున్నా చుట్టి వచ్చేందుకా.. కొంచమైనా ఉండాలి.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సీజన్లో మాక్స్ వెల్ ఆటతీరు అంత గొప్పగా లేదు.. ఏకంగా నాలుగుసార్లు గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడంటే అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో అతడి హైయెస్ట్ స్కోర్ 28 పరుగులు.. 0, 3, 28, 0, 1, 0 4, 16, 0 ఇంతటి చెత్త గణాంకాలు నమోదు చేసిన తర్వాత కూడా బెంగళూరు జట్టు కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లో మాక్స్ వెల్ కు ఎలా అవకాశం ఇచ్చిందో అంత పట్టడం లేదని అభిమానులు వాపోతున్నారు. మాక్స్ వెల్ పై మండిపడుతున్నారు.
వాస్తవానికి మాక్స్ వెల్ ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు సూపర్ ఫామ్ లో ఉన్నాడు.. గత ఏడాది మన దేశం వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 201* పరుగులు చేసి.. ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు.. అంతటి సూపర్ ఫామ్ లో ఉన్న మాక్స్ వెల్ గోల్డెన్ డక్ ఔట్ కావడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆటగాడినా కోట్లు పోసి కొన్నది అంటూ మండిపడుతున్నారు.. ఇక ప్రస్తుతం బెంగళూరు జట్టు 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. లోమ్రోర్ 27*, దినేష్ కార్తీక్ 10* పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.