Rohit Sharma: హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఢిల్లీ జట్టుపై ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై గెలిచింది. ఐపీఎల్ 17వ సీజన్ లో బోణి కొట్టింది. ఈ విజయంతో ముంబై జట్టు ఊపిరి పీల్చుకుంది. హార్దిక్ పాండ్యా కు సాంత్వన లభించింది. మరి ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ఏం చేస్తున్నాడు? ఢిల్లీ తో గెలిచిన అనంతరం ఎవరికీ కనిపించని అతడు ఎక్కడికి వెళ్ళాడు? సోషల్ మీడియాలో ఒకటే వెతుకులాడారు. అతడి నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ముంబై జట్టు అభిమానులు కూడా తెగ శోధించారు.. అయినప్పటికీ ఉపయోగం లేదు. కానీ తర్వాత రోహిత్ జాడ తెలుసుకొని నవ్వుకున్నారు.
ఆ బాధ లేదు
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ ని హార్దిక్ పాండ్యాకు ఇచ్చింది. రోహిత్ నుంచి కెప్టెన్సీ ని పాండ్యాకు ఎందుకు ఇచ్చిందనేదానిపై ఇప్పటికీ ముంబై యాజమాన్యానికి ఓ క్లారిటీ లేదు. జట్టు అవసరాల దృష్ట్యా అని చెబుతున్నప్పటికీ.. రోహిత్ తర్వాత ముంబై జట్టులో గొప్ప ఆటగాడు లేడా? గుజరాత్ జట్టు నుంచి తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యానే కప్ గెలిపించుకోస్తాడా? అనే ప్రశ్నలకు ముంబై యాజమాన్యం దగ్గర స్పష్టమైన సమాధానాలు లేవు. ముంబై జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి కొద్దిరోజులు రోహిత్ శర్మ బాధపడ్డాడు. ఒకానొక దశలో ముంబై జట్టు నుంచి బయటికి వెళ్దామని భావించాడు. ఈ సీజన్ లో అసలు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తానికి రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా ముంబై జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ మినహా.. మిగతా అన్నింటిలో తన స్థాయికి తగ్గట్టు ఇన్నింగ్స్ ఆడాడు. తన సీనియారిటీకి గౌరవం ఇవ్వకుండా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాలని హార్దిక్ పాండ్య ఆదేశిస్తే అక్కడికి కూడా వెళ్ళాడు.. మొత్తానికి ఎదురు ప్రశ్నలు వేయకుండా.. చికాకులు కలిగించకుండా జెంటిల్మెన్ గేమ్ ను జెంటిల్మెన్ లాగా ఆడాడు.. అందువల్లే రోహిత్ తిరిగి ముంబై కెప్టెన్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే కొన్ని లక్షల వ్యాఖ్యానాలను రోహిత్ కు అనుకూలంగా అభిమానులు పోస్ట్ చేశారు. అయినప్పటికీ ముంబై మేనేజ్మెంట్ మనసు కరగలేదు.
విజయం అనంతరం..
మూడు ఓటముల తర్వాత ఢిల్లీ జట్టుపై ఆదివారం జరిగిన మ్యాచ్ లో గెలిచిన ముంబై జట్టు సంబరాలు చేసుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాడు. ముంబై జట్టు యాజమాన్యం కొంత శిరోభారం తగ్గిందని అనుకుంది. కానీ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కనిపించలేదు. మ్యాచ్ గెలిచిన అనంతరం అతడు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోయాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్ళాడో జట్టు సభ్యులకు కూడా తెలియదట. ఇటీవల హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్లో ఓడిపోయిన అనంతరం రోహిత్ శర్మతో ఆకాష్ అంబానీ చర్చలు జరిపాడు. కొంపదీసి హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి రోహిత్ శర్మకు మళ్ళీ కెప్టెన్సీ ఇస్తారా? అందుకోసమే అతడు చెప్పకుండా వెళ్ళిపోయాడా? అనే వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ శర్మ తన సతీమణితో కలిసి సరదాగా విహరించాడు. బ్యాటరీ కారు లో లాంగ్ డ్రైవ్ కు వెళ్లామని.. తన సతీమణితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అటు ముంబై ఆటగాళ్లు, ఇటు రోహిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య రోహిత్ శర్మ ఎక్కడికీ పోలేదు. సరదాగా తన సతీమణితో గడుపుతున్నాడని మనసులో అనుకున్నారు. కాగా, రోహిత్ శర్మ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.