https://oktelugu.com/

IND vs NZ 3rd Test : మీ సేవలు జట్టుకు ఇక చాలు.. రోహిత్, విరాట్ మీ టెస్టు దుకాణం బంద్ చేస్తే మంచిది

ఒకసారి జరిగితే తప్పు అంటారు. రెండోసారి జరిగితే దురదృష్టం అంటారు. అదేపనిగా అదే తప్పు చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? వారి నిర్లక్ష్యానికి ఎలాంటి పదాన్ని వాడాలి.. ఒకటా, రెండా అవకాశాల మీద అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వారు మాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 1, 2024 8:21 pm

    IND vs NZ 3rd Test

    Follow us on

    IND vs NZ 3rd Test : బెంగళూరు, పూణే వేదికలపై జరిగిన టెస్టులలో టీమిండియా ఓడిపోయింది. ఓడిపోయింది అనేదానికంటే విరాట్, రోహిత్ వైఫల్యం వల్ల సిరి కోల్పోయింది అని చెప్పడం సబబు. ఒక ఇన్నింగ్స్ లోనూ వారిదైన శైలిలో ఆడలేదు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అంతేతప్ప ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. దీంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా వారు కూడా చేతులెత్తేశారు. దీంతో పుష్కరకాలం తర్వాత టీమిండియా తొలిసారి సిరీస్ కోల్పోయింది. అది కూడా న్యూజిలాండ్ జట్టుపై.. న్యూజిలాండ్ జట్టులో అరివీర భయంకరమైన ఆటగాలు లేరు. నిప్పులు చెరిగే విధంగా బంతులు వేసే బౌలర్లు కూడా లేరు. కానీ వారి ముందు విరాట్, రోహిత్ నిలబడలేకపోతున్నారు. వారు వేసే బంతులను తట్టుకోలేక నిరాశగా మైదానాన్ని వీడుతున్నారు. వారు అవుట్ అవుతున్న తీరు చూస్తే గల్లి స్థాయి క్రికెటర్లు గుర్తుకు వస్తున్నారు. ఈ మాట అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

    వాస్తవానికి ఇప్పటికే టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. చివరిదైన మూడో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలని సగటు భారత అభిమాని భావిస్తుంటే.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్, రోహిత్ మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నారు. దరిద్రమైన షాట్లు ఆడుతూ పరువు తీసుకుంటున్నారు. అనామక బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నారు. శుక్రవారం ప్రారంభమైన ముంబై టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ మూడు ఫోర్లు కొట్టాడు. 18 పరుగులు చేశాడు.. ఆ తర్వాత హెన్రీ బౌలింగ్ లో లాతం కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 25 పరుగులు మాత్రమే.. ఆ తర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, గిల్ రెండో వికెట్ కు 53 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత జైస్వాల్ (30) అజాజ్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 78 పరుగులు.. ఈ దశలో నైట్ వాచ్మెన్ గా వచ్చిన మహమ్మద్ సిరాజ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అజాజ్ పటేల్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ నాలుగు పరుగులు మాత్రమే చేసి హెన్రీ విసిరిన బంతికి రన్ అవుట్ అయ్యాడు.

    న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ , రోహిత్ పెద్దగా రాణించింది లేదు. ఐదు ఇన్నింగ్స్ లలో వారిద్దరు చెరొక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగారు. ఇద్దరూ  చెరొకసారి గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మిగతా ఆటగాళ్లు t20 ఫార్మాట్ వల్ల దారి తప్పారు అనుకుందాం. కానీ విరాట్, రోహిత్ కు సుదీర్ఘమైన అనుభవం ఉంది. అటువంటి ఆటగాళ్లు ఇలా అవుట్ కావడం సగటు భారత అభిమానిని నివ్వెర పరుస్తోంది. ఇదే సమయంలో వారిద్దరూ టి20 క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నట్టుగానే.. టెస్ట్ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలకాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.