Rohit Sharma: రోహిత్ చేసిన పనితో అంతా అయోమయం

ఆదివారం యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ జోడి ఇంగ్లాండు బౌలర్లను ఊచకోతకోస్తోంది. అప్పటికీ భారత స్కోరు 400 పరుగులను సమీపించింది. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారని అందరూ అనుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 19, 2024 10:36 am
Follow us on

Rohit Sharma: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ వరుసగా రెండవ టెస్టు విజయాన్ని సాధించింది..2-1 తేడాతో ముందంజలో ఉంది. రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండు  జట్టును ఓడించి భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రోహిత్ సేన అతిపెద్ద విజయాన్ని నమోదుచేసింది. భారత విజయంలో రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కీలకపాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ తో పాటు, రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి రవీంద్ర జడేజా మరోసారి తన స్టార్ ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.. భారత జట్టు విజయం సాధించడానికి ముందు మైదానంలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతమిది స్పోర్ట్స్ సర్కిల్లో నవ్వులు పూయిస్తోంది.

ఆదివారం యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ జోడి ఇంగ్లాండు బౌలర్లను ఊచకోతకోస్తోంది. అప్పటికీ భారత స్కోరు 400 పరుగులను సమీపించింది. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక ఆట 97వ ఓవర్ లోకి ప్రవేశించింది. యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ జోడి  జో రూట్ బౌలింగ్లో 1, 1, 6, 6, 0, 1 ఎదురుదాడికి దిగడంతో భారత జట్టు స్కోరు ఒక్కసారిగా నాలుగు వందల మార్కు దాటింది. ఈ క్రమంలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వైట్ జెర్సీ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తున్నాడు. అయితే అతడు వైట్ డ్రెస్ తో కనిపించడంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారని యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ జోడి భావించి డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేశారు.. అయితే అతడి నుంచి అటువంటి సంకేతాలు రాకపోవడంతో మళ్లీ వెనుకడుగు వేశారు.
ఈ దృశ్యాన్ని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లలో అయోమయం ఏర్పడింది. ఇంతకీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారా? లేదా? అనే సంశయం వారిలో నెలకొంది. రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేలాగా కనిపించకపోవడంతో చేసేదేం లేక ఇంగ్లాండ్ కెప్టెన్ రేయాన్ అహ్మద్ కు బౌలింగ్ ఇవ్వడంతో.. అతని బౌలింగ్లో 1, 6, 4, 6, 0, 1 యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ జోడి  18 పరుగులు పిండుకుంది. దీంతో భారత జట్టు స్కోరు నాలుగో వికెట్ల నష్టానికి 434 పరుగులకు చేరుకుంది. దీంతో భారత్ లీడ్ 556 పరుగులకు  చేరుకోవడంతో ఒక్కసారిగా భారత కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైదానం వీడారు. రోహిత్ నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఎక్కువ విశ్రాంతి లభించలేదు. దీంతో వారు వెంటనే మళ్ళీ బ్యాటింగ్ కు రావాల్సి వచ్చింది. ఒకవేళ వైట్ డ్రెస్ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి రోహిత్ శర్మ వచ్చినప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటిస్తే ఇంగ్లాండ్ జట్టుకు కొంతలో కొంతైనా విశ్రాంతి లభించేది. కానీ రోహిత్ శర్మ అలా చేయకుండా వైట్ డ్రెస్ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోవడం.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారని యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ జోడి అనుకుని పెవిలియన్ వైపు వెళ్లడం.. వారిని ఇంగ్లాండ్ ఆటగాళ్లు అనుసరించడం.. వంటి దృశ్యాలు మైదానంలో నవ్వులు పూయించాయి.