https://oktelugu.com/

Rohith Sharma : బోర్డర్ గవాస్కర్ తొలి టెస్ట్ కు రోహిత్ దూరం.. కారణం ఏంటంటే..

దక్షిణాఫ్రికా తో ప్రస్తుతం టీమిండియా టి20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిశాయి. మొదటి మ్యాచ్లో టీమిండియా, రెండో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 11, 2024 10:57 am
    Rohith Sharma

    Rohith Sharma

    Follow us on

    Rohith Sharma :  దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. అక్కడ కంగారులతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి వెళ్లాలంటే టీ మీడియా ఖచ్చితంగా ఈ సిరీస్లో అద్భుతమైన విజయాన్ని సాధించాలి. 4-0 తేడాతో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్తుంది. ఒకవేళ 5-0 తేడాతో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా దర్జాగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోవడంతో టీమ్ ఇండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యంత ముఖ్యంగా మారిపోయింది. గత రెండు సీజన్లలో టీమ్ ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ క్రమంలో ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. అయితే ఆస్ట్రేలియా కూడా గత రెండు సీజన్లలో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. ఇటీవల భారత – ఏ జట్టు, ఆస్ట్రేలియా – ఏ తలపడ్డాయి. రెండు అనధికారిక టెస్టులు ఆడాయి. ఈ రెండు మ్యాచ్లలో భారత – ఏ జట్టు ఓటమిపాలైంది. దీంతో సిరీస్ ప్రారంభానికిమందు ఆస్ట్రేలియా జట్టు కాస్త సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంది.

    రోహిత్ దూరం..

    తొలి టెస్ట్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ దూరం కానున్నాడు. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. అయితే ఈ టెస్టుకు రోహిత్ దూరమవుతాడని.. దానికి అతడి వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోంది. రోహిత్ శర్మ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. ఆమె వచ్చే వారంలో ప్రసవించనుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన తర్వాత రోహిత్ ఆస్ట్రేలియాతో ఆడే తొలి టెస్ట్ కు దూరం ఉంటాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అటు బీసీసీఐ.. ఇటు రోహిత్ నోరు విప్పలేదు. తీరా ఇన్ని రోజులకు క్లారిటీ ఇచ్చేశారు. రోహిత్ భార్య వచ్చే వారంలో ప్రసవించనున్న నేపథ్యంలో అతడు పెర్త్ టెస్ట్ కు అందుబాటులో ఉండడని జట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. తన భార్య ప్రసవం నేపథ్యంలో ఆమె పక్కన ఉండాలని రోహిత్ భావించాడని.. ఇదే విషయాన్ని తమతో చెబితే తొలి టెస్ట్ కు అతడికి విశ్రాంతి ఇచ్చామని జట్టు మేనేజ్మెంట్ వివరించింది. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ ఎవరు వహిస్తారనే విషయాన్ని కూడా మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. కాగా ఆస్ట్రేలియా సిరీస్ ను టీమిండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. జట్టు మేనేజ్మెంట్ కూడా పట్టిష్టమైన ప్రణాళికలను రూపొందించినట్టు జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది.