Nominated posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది.నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం రెండో జాబితాను విడుదల చేసింది.మూడు పార్టీల కూటమి నేపథ్యంలో.. మూడు పార్టీల నేతలకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు.మొత్తం 62 పదవులను భర్తీ చేశారు. సలహాదారులతో పాటు కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించారు. ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లను కూడా నియామకాలు చేశారు.అయితే ఆశావహులు వేలాదిమంది ఉంటే.. కొంతమందికి మాత్రమే పదవులు దక్కాయి.అయితే దాదాపు పార్టీ కోసం కష్టపడిన వారికి ఛాన్స్ ఇచ్చారు.అనూహ్యంగా కొందరి పేర్లు సైతం ప్రకటించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి ఇచ్చారు. మాచర్లలో పార్టీ కోసం రక్తం చిందించిన మంజుల రెడ్డికి సైతం గౌరవించారు. వైసిపి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించిన పట్టాభికి సైతం ఛాన్స్ ఇచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో చేరి తన వాయిస్ వినిపించిన జీవి రెడ్డికి సైతం గౌరవం ఇచ్చి పదవి కట్టబెట్టారు. అటు జనసేన విషయంలో సైతం కష్టపడే వారికి గుర్తింపు ఇచ్చారు. బిజెపికి సైతం సరైన ప్రాతినిధ్యం కల్పించారు. అందుకే ఎక్కడా రెండో జాబితా పై అసంతృప్తి వ్యక్తం కాలేదు. తొలి జాబితాపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఆవేదన బయటపెట్టారు.
* సుదీర్ఘ కసరత్తు
నామినేటెడ్ పదవుల భర్తీకి సుదీర్ఘ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. తొలుత ఐవిఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. తరువాత నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సీనియారిటీ, సిన్సియార్టీ కి ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటికి రెండుసార్లు ఆ నేతల విషయంలో ఆరా తీశారు. పూర్తిస్థాయి అభిప్రాయ సేకరణ తరువాత మాత్రమే పదవులకు ఎంపిక చేశారు. అందులో కూడా సామాజిక సమతూకం పాటించారు. అన్నింటికీ మించి ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. పదవులు దక్కించుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
* పోరాడిన వారికి ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల కోసం 30 వేల దరఖాస్తులు వచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.కానీ పార్టీ కోసం పోరాడి నిలిచిన వారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అటువంటి వారు ఏ మారుమూల గ్రామంలో ఉన్న గుర్తించి మరి పదవులు కట్టబెట్టినట్లు చంద్రబాబు చెప్పారు. పదవులు దక్కించుకున్న వారు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఎటువంటి దర్పం, పదవి వచ్చిందని అహంకారం ప్రదర్శించవద్దని.. ఆర్భాటం చేయవద్దని సూచించారు సీఎం. అప్పుడే రాజకీయంగా ఎదగ గలుగుతారని గుర్తు చేశారు చంద్రబాబు.